Chai Business: చాయ్.. పేరుకు రెండు అక్షరాలు మాత్రమే. కానీ దీని ఆధారంగా సాగుతున్న వ్యాపారం ₹వేల కోట్లు. జమ్మూ కాశ్మీర్ ఇరానీ చాయి నుంచి హైదరాబాద్ పాతబస్తీ కడక్ చాయ్ వరకు.. వందలాది ఫ్లేవర్లు.. అంతటి మహత్తు ఉంది గనుక చాయ్ భారతీయుల జీవితంలో ఒక భాగమైపోయింది. పొద్దున లేవగానే వేడి వేడి పొగలు గక్కుతూ పలకరిస్తుంది. సాయంత్రం స్నాక్స్‌తో దోస్తీ కడుతుంది. దోస్తీలతో కలిస్తే.. వన్ బై టూ అంటూ అభిమానం పంచుతుంది. అతిథులొచ్చినా, మిత్రులొచ్చినా చాయ్‌తోనే మర్యాదలు మొదలవుతాయి… ముచ్చట్లు కొనసాగుతాయి. అలసటగా ఉన్నప్పుడు.. జోష్ కావాలంటే సింగిల్ చాయ్ లోపలికి దిగాల్సిందే.. సిప్పు సిప్పుకూ ఉత్తేజం పొందాల్సిందే..
చటుక్కున తాగేస్తున్నారు
ఏ చాయ్.. చటుక్కున తాగరా భాయ్.. ఈ చాయ్ చమక్కులే చూడరా చాయ్.. ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్.. ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్.. ఇలాంటి చాయ్ చమక్కులు ఎన్నో! అసలు చాయ్ అంటే ఏంటనుకున్నారు? అది మన జాతీయ పానీయం. నిత్య జీవితంలో భాగం. ఇంటికి అతిథులు వచ్చినా, నలుగురు స్నేహితులు కలిసినా, సరదాగా నాలుగు ముచ్చట్లు చెప్పుకోవాలన్నా.. అందుబాటులో ఉండే అడ్డా.. టీ స్టాల్. అందుకే దేశ ప్రధాని సైతం తన కార్యక్రమానికి చాయ్ పే చర్చా అని పేరు పెట్టుకున్నారు. రోడ్డు పక్కన టీ బండిపై పొగలు కక్కే చాయ్ తాగడం అందరికీ ఇష్టమే.. కానీ ఆ వ్యాపారం చేయాలంటే మాత్రం యువతకు నామోషీ. టీ కొట్టు పెట్టుకోవాలంటే చిన్నచూపు.
మరి.. ఆ వ్యాపారానికే కార్పొరేట్ లుక్ ఇస్తే? దాన్నే వందల కోట్ల బిజినెస్‌గా మార్చితే..? అలా వచ్చిన వాళ్లే టీ ఎంటర్‌ప్రెన్యూర్స్. దేశ వ్యాప్తంగా ఇలాంటి కార్పొరేట్ టీ కొట్ల వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. గరం గరం లాభాలు కురిపిస్తోంది.
వ్యాపారానికి ఢోకా లేదు..సమాజంలో పేదలు, ధనికులు అన్న తేడా లేకుండా కొనుగోలు చేసే నిత్యావసరాల్లో టీ ఉత్పత్తులు ముఖ్యమైనవి. ఒకప్పుడు నాలుగైదు బ్రాండ్లకు మించి ఉండేవి కావు. ఇప్పుడు మార్కెట్లోకి రకరకాల టీ కంపెనీలు వచ్చేశాయి. ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా తరువాత దేశం మనదే!. అసోం, డార్జిలింగ్లలోని తేయాకులకు డిమాండ్ ఉంది. టీ పొడి ఎగుమతుల్లో కూడా భారత్ ముందుంది. అంతర్జాతీయంగా చూస్తే.. ముప్పయి శాతం టీ పొడిని భారతీయులే వాడేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన జాతీయ సర్వే ప్రకారం కాఫీ కంటే పదిహేను రెట్లు ఎక్కువగా మనవాళ్లు చాయ్ తాగుతున్నారని తేలింది. చాయ్ తాగడం ఈనాటి అలవాటు కాదు. ప్రాచీన కాలం నుంచీ వస్తోంది. అప్పట్లో హెర్బల్ టీలు కాచుకుని ఎక్కువగా తాగేవాళ్లు. పరిణామక్రమంలో తేయాకు, పాలు, చక్కెరతో చేసిన టీ తాగడం మొదలైంది. ఇప్పుడు ఆధునిక తరం అభిరుచులు మారడంతో మరిన్ని రకాల ఫ్లేవర్స్‌తో తయారుచేసిన టీ లు వచ్చేశాయి. ఈమధ్య మన దేశంలో యువ ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగింది. తేనీటి ప్రియులు ఎక్కువయ్యారు.. కాబట్టి అధిక జనాభా కలిగిన భారత్‌లో చాయ్ వ్యాపారానికి ఢోకాలేదు.
రకరకాల ఫ్లేవర్లు
ఒకప్పుడు చాయ్ అంటే ఒకటే రుచి. ఇప్పుడలా కాదు. రకరకాల ఫ్లేవర్లు వచ్చేశాయి. వినియోగదారుల అభిరుచుల్లోనూ మార్పు వచ్చింది. ఇరానీ చాయ్, గ్రీన్ టీ, అల్లం టీ, మసాలా టీ అంటూ నాలుగైదు వెరైటీల దగ్గరే చాలామంది ఆగిపోతారు. కానీ, ఇప్పుడు చాయ్ బార్లు, టీ ఔట్లెట్లలో పదుల సంఖ్యలో వెరైటీ చాయ్‌లు నోరూరిస్తున్నాయి. తేయాకు ఎంపికలో సంప్రదాయ ఇరానీ కేఫ్‌లు ఎంత జాగ్రత్త వహిస్తాయో, విభిన్న రుచులతో ప్రయోగాలు చేయడానికి సరికొత్త టీ బార్లు అంతే ఆసక్తిని చూపుతున్నాయి. మందార మకరందం, గులాబీల గుబాళింపు, మల్లెల గమ్మత్తు ఇలా ఒక్కటేమిటి? టీ ప్రేమికులను ఆకట్టుకుంటాయనే ఏ పదార్థాన్నీ వదలడం లేదు. దాదాపు 1500 రకాల టీలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
మన ప్రాంతాల్లో కూడా వందల రకాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ డిమాండ్ దృష్ట్యా కొత్తగా రంగ ప్రవేశం చేస్తున్న కంపెనీలు వినూత్న ప్రయోగాలతో విభిన్న రుచుల్లో టీ పొడులను తీసుకొస్తున్నాయి. మిల్క్ బబుల్ టీ, గ్రేప్ ఐస్ టీ, లెమన్ ఐస్ టీ, కశ్మీరీ కావా, గ్రీన్ మ్యాంగో.. ఇలాంటివన్నీ కస్టమర్లను ఊరిస్తున్నవే. రెడ్ జెన్, రష్యన్ కారవన్, సిల్వర్ నీడిల్ వైట్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ.. లాంటి ఎక్సోటిక్ టీలూ ఉన్నాయి. ఒక్కో టీ ఒక్కో విధమైన రుచి, వాసన, రంగు కలిగి ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. వైట్, సిల్వర్ నీడిల్ వైట్ టీ, ఊలాంగ్, పెరల్స్, మొరాకన్ మింట్, జపనీస్ సెన్చా తరహా టీలు రూ. 300ల నుంచి లభ్యమవుతున్నాయి. పండ్లు, పూలు, క్రీమర్స్, మసాలాలు, ఫ్లేవర్స్, మొక్కలను జోడించి టీ పొడులను తయారు చేస్తున్నారు. కిలోకు రూ.20,000 వరకు ధర పలికే గోల్డెన్ టిప్స్ వంటి వెరైటీలకు కూడా ఆదరణ లభిస్తోంది.పొగలు కక్కే తందూరి చాయ్ కూడా ఇప్పుడు బాగా ఫేమస్ అయింది. పాలను మరిగించి తగినంత చక్కెర కలిపి తందూరి టీ పౌడర్ వేసి తయారు చేస్తారు. ఒక డ్రమ్ము లాంటి ఇనుప పాత్రలో సగానికిపైగా ఇసుకతో నింపి దానిపై బొగ్గులు వేసి నిప్పు పెడతారు. బొగ్గులు వేడెక్కిన తరువాత కొత్త మట్టి కుండలను వేడి చేస్తారు. ఫిల్టర్ చేసిన టీని వేడిగా ఉన్న మట్టి కుండలోకి ఒంపి.. దాన్ని మట్టి కప్పులో పోసి అందిస్తారు. ఈ తందూరీ చాయ్ బాగా ప్రాచుర్యం పొందింది.
Also Read:Chandrababu And Pawankalyan: పవన్ తో పొత్తుకు పోదామా..? పంతం నెగ్గిచ్చుకుందామా..?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: How did chai become a multi billion dollar business
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com