Gold Rates : మగువలకు బంగారం అంటే చాలా ఇష్టం. ప్రతి మగువ బంగారం కొనడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తుంది. అయితే రాను రాను బంగారం ధరలు పెరిగిపోయి అందరికీ షాక్ కు గురి చేస్తున్నాయి. బంగారం ధర ఒక్క ఏడాదిలో 30 శాతం పెరిగింది. అలాగే గత రెండు ఏళ్లలో 51 శాతం పెరిగింది. ఇక గడిచిన 5 ఏళ్లలో 114% పెరిగి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ ఏడాది కూడా బంగారం ధర పెరుగునుందా… బంగారం ధర లక్ష మైలురాయిని దాటడానికి ఇంకా ఎంత దూరం ఉంది.. ఈ ఏడాది బంగారం తో పాటు వెండి, డైమండ్, ప్లాటినం ధరలు సైతం డిబేటబుల్ టాపిక్ గా మారనున్నాయా తెలుసుకుందాం. కొత్త క్యాలెండర్ లోకి అడుగుపెట్టిన తర్వాత బంగారం ధర ఏమైనా దిగి వచ్చి బంగారం కొనడానికి వీలుగా ఉంటుందా అంటూ కొత్త బంగారులోకం వైపు ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్నమెంటల్ మెటల్స్ ధరలు కూడా పెరిగి ఆకాశం వైపే చూస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు ఈ మధ్యకాలంలో తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగడం ప్రారంభించాయి. కొత్త సంవత్సరంలో కూడా బంగారం ధరలు కొనేవాళ్లకు చుక్కలు చూపిస్తాయని సమాచారం. భాగ్యనగరంలో నేడు 24 క్యారెట్ల పసిడి ధర రూ.80 వేలకు అటూ ఇటూ అనే మాట వినిపిస్తుంది. ఇక అతి త్వరలో ఈ బంగారం ద్వారా 90 వేల మార్క్ ను దాటి లక్షకు చేరుకోవచ్చని అంచనాలు, ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. బంగారానికి మించిన మంచి ఇన్వెస్ట్మెంట్ లేదని చెప్పిన మార్కెట్ నిపుణులు ఈ బంగారం ధరల భవిష్యత్తును తేల్చి చెప్పేస్తున్నారు. ఇక పెరుగుతున్న ఈ బంగారం ధరలు పసిడి ప్రియులను బెంబేలెత్తిస్తున్నాయి. గడిచిన 5 ఏళ్ల నుంచి బంగారం ధరలను గమనిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2017 లో 30000 ఉన్న పది గ్రాముల బంగారం ధర ఆ తర్వాత 2019లో 35 వేలకు, 2022లో 52వేలకు చేరిన సంగతి తెలిసిందే.
ఇక 2023లో మరో 10 వేలు పెరిగి బంగారం ధర 65000 అయ్యింది. 22 క్యారెట్ల బంగారం ధర గత ఏడాది 53 వేలకు అటు ఇటు ఉండేది. అది కాస్త ఇప్పుడు 80000 క్రాస్ చేస్తూ జనవరి నెలాఖరులోపు ఆల్ టైం రికార్డ్ ను సొంతం చేసుకునే పనిలో ఉంది. పసిడిపై పెట్టుబడి పెట్టిన వాళ్లకు పెరుగుతున్న బంగారం ధరలు అధిక లాభాలను ఇచ్చి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. నాలుగేళ్లలోనే రెండింతల లాభాన్ని సొంతం చేసుకున్నారు. బంగారం లో పెరుగుదల ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరి కల్లా మరో 30 శాతం పెరిగి లక్ష మార్కు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు గమనించిన దాన్ని బట్టి బంగారం ధరలో తగ్గుదల తాత్కాలికం అలాగే పెరుగుదల శాశ్వతంగా కనిపిస్తుంది. అయితే గత నవంబర్ నెలలో బంగారం ధరలు అనూహ్యంగా దిగొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
80000 దాటిన బంగారం ధర చిన్నపాటి కరెక్షన్ పాయింట్ వచ్చి 1000 రూపాయలు దిగొచ్చు అంతే కదా అని అందరూ అనుకున్నారు. కానీ రెండు రెండు రోజుల్లోనే ఏకంగా 5000 దిగొచ్చింది. 83000 ఉన్న పది గ్రాముల బంగారం ధర 75 వేలకు దిగింది. ముఖ్యంగా బంగారం ధరల్లో అమెరికా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తగ్గుదల నమోదయింది. బంగారం ధరలు పాతాళానికి దాక్కుతాయని, కొని పెట్టుకున్న కొనుగోలుదారులందరూ అమ్మేసుకోవడం బెటర్ అంటూ వార్తలు కూడా వినిపించాయి. ప్రపంచం మొత్తానికి బంగారం మీద ఆసక్తి తగ్గిపోవడంతో డిమాండ్ బాగా పెరిగిపోయింది. కానీ ఇది కేవలం రెండు వారాలు మాత్రమే కొనసాగింది. స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ కూడా గోల్డ్ మార్కెట్ మూమెంట్స్ ని బలంగా శాసిస్తున్నాయని తెలుస్తుంది.