Honda Activa : భారతదేశపు అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా హోండా యాక్టివా తన స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకుంది. ఇటీవల విడుదలైన ఆర్థిక సంవత్సరం 2025 (ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు) అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ కాలంలో యాక్టివాను ఏకంగా 25 లక్షల మందికి పైగా కొనుగోలు చేశారు. తన సమీప పోటీదారులైన టీవీఎస్ జూపిటర్ మరియు సుజుకి యాక్సెస్‌లను గణనీయమైన మార్జిన్‌తో వెనక్కి నెట్టి, హోండా యాక్టివా తిరుగులేని నంబర్ వన్‌గా నిలిచింది. ఆర్థిక సంవత్సరం 2025లో మొత్తం 25,20,520 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2024తో పోలిస్తే 11.80 శాతం అధికం. దేశంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు స్కూటర్లలో దాదాపు ఒకటి హోండా యాక్టివానే కావడం విశేషం.
Also Read : పవర్ ఫుల్ 150సీసీ ఇంజిన్ తో మార్కెట్లో కొత్త బజాజ్ సీఎన్జీ
హోండా యాక్టివాకు ప్రధాన పోటీ టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ నుంచి ఉంది. ఈ రెండు స్కూటర్లు కూడా ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయినప్పటికీ, అమ్మకాల పరంగా అవి యాక్టివాకు చాలా వెనుకబడి ఉన్నాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు స్కూటర్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. టీవీఎస్ జూపిటర్‌ను మొత్తం 11,07,285 మంది కొనుగోలు చేశారు. ఇది గతేడాదితో పోలిస్తే 31.06శాతం వృద్ధిని సూచిస్తుంది. ఇక మూడో స్థానంలో ఉన్న సుజుకి యాక్సెస్‌ను 7,27,458 మంది కొనుగోలు చేశారు. వార్షిక ప్రాతిపదికన దీని అమ్మకాల్లో 14.64శాతం పెరుగుదల నమోదైంది.
హోండా యాక్టివా భారతదేశంలో అత్యంత పాపులర్ మోడల్స్ లో ఒకటి. ఇది ప్రధానంగా రెండు ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.. అవి 109.5 సిసి, 124 సిసి. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.78,684 (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై, టాప్ మోడల్‌కు దాదాపు రూ.లక్ష వరకు ఉంటుంది. ఈ సిరీస్ లో హోండా యాక్టివా 6G అత్యంత సరసమైన మోడల్ కాగా, హోండా యాక్టివా 125 అత్యంత ఖరీదైనది. ఈ స్కూటర్లు లీటరుకు 42.5 కిలోమీటర్ల నుండి 47 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తాయి. రెండు మోడళ్లలోనూ అద్భుతమైన ఫీచర్లు, అనేక కలర్ ఆప్షన్లను అందుబాటులో ఉన్నాయి.
హోండా యాక్టివా అనేక లేటెస్ట్ ఫీచర్లతో వస్తుంది. వాటిలో ఎల్‌ఈడీ పొజిషన్ ల్యాంప్, ఎన్‌హాన్స్‌డ్ స్మార్ట్ పవర్ (ఈఎస్‌పీ) టెక్నాలజీ, ఏసీజీ స్టార్టర్, ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్, సైడ్ స్టాండ్ ఇంజన్ ఇన్హిబిటర్ ఫంక్షన్, గత మోడల్ నుంచి కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ముఖ్యమైనవి. యాక్టివా 125లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది ఓడోమీటర్, క్లాక్, ఎకో ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ వంటి సమాచారాన్ని అందిస్తుంది. హెచ్-స్మార్ట్ వేరియంట్‌లో స్మార్ట్ కీ సిస్టమ్ కూడా లభిస్తుంది. ఇది స్మార్ట్ ఫైండ్, రిమోట్ అన్‌లాక్, కీలెస్ ఇగ్నిషన్, యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ వంటి ఎక్స్ ట్రా సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తుంది.
Also Read : అట్లర్ ప్లాప్ గా హీరో స్ప్లెండర్, హోండా యాక్టీవా.. ఎలా అంటే ?