Home Loan: హోమ్ లోన్స్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి శుభవార్త చెప్పింది. నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) కట్టడానికి కష్టపడుతున్న వారికి పెద్ద ఊరట లభించింది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించింది. ఈ సంవత్సరంలో ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం ఇది మూడోసారి. మొత్తం మీద ఇప్పటివరకు ఒక శాతం వడ్డీ రేటును తగ్గించినట్లు అవుతుంది. ఈ తాజా నిర్ణయంతో, హోమ్ లోన్స్ తీసుకున్న వారికి ఈఎంఐ భారం మరింత తగ్గుతుంది.
ఫ్లోటింగ్ రేటు పై హోమ్ లోన్స్ తీసుకున్నట్లయితే, ఆర్బీఐ తగ్గించిన వడ్డీ రేట్ల బెనిఫిట్ మీకు వెంటనే అందుతుంది. 2019 అక్టోబరు 1 తర్వాత ఇచ్చిన అన్ని ఇంటి రుణాలను ఫ్లోటింగ్ వడ్డీ రేటుతోనే ఇచ్చారు. కాబట్టి, బ్యాంకులు తమ వడ్డీ రేట్లను ఆర్బీఐ నిర్ణయానికి తగ్గట్టుగా మారుస్తాయి. పాత కస్టమర్లకే కాకుండా, కొత్తగా రుణాలు తీసుకునే వారికి కూడా తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు లభిస్తాయి. అంతేకాకుండా, పెద్ద మొత్తంలో రుణం పొందే అవకాశం కూడా ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.
ఈఎంఐ తగ్గించుకోవాలా? కాలపరిమితి తగ్గించుకోవాలా?
ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన తర్వాత, రుణం తీసుకున్న వారికి రెండు అవకాశాలు ఉంటాయి:
నెలవారీ వాయిదా (ఈఎంఐ) తగ్గించుకోవడం. రుణాన్ని తిరిగి చెల్లించే సమయం (లోన్ టెన్యూర్) తగ్గించుకోవడం. నిపుణులు మాత్రం రెండవ ఆప్షన్ ఎంచుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే, దీనివల్ల దీర్ఘకాలంలో చాలా వడ్డీని ఆదా చేసుకోవచ్చు.
ఎలాగో ఉదాహరణతో చూద్దాం. మీరు ఈ సంవత్సరం జనవరిలో 20 సంవత్సరాల కోసం రూ.50 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకోండి. * ఆ సమయంలో బ్యాంకు వడ్డీ రేటు 8.50 శాతం అయితే, మీరు నెలకు రూ.43,391 వాయిదా కట్టాల్సి వచ్చేది.
* ఇప్పుడు, ఆర్బీఐ మూడు దశల్లో వడ్డీ రేట్లను తగ్గించడంతో, మీ మొత్తం నెలవారీ వాయిదా రూ.40,280 కి తగ్గుతుంది.
* అంటే, మీరు నెలకు సుమారు రూ.3,000 ఆదా చేసుకుంటారు. దీర్ఘకాలంలో మొత్తం వడ్డీ భారం సుమారు రూ.7.12 లక్షలు తగ్గుతుంది.
లోన్ టెన్యూర్ మార్చుకుంటే మరింత ఆదా
ఒకవేళ మీరు నెలకు కట్టే వాయిదాను (ఈఎంఐని) మార్చకుండా లోన్ టెన్యూర్ తగ్గించుకుంటే, రుణం తిరిగి చెల్లించే సమయం సుమారు మూడు సంవత్సరాలు తగ్గుతుంది.
* ఉదాహరణకు, మీరు జనవరిలో 240 నెలల కాలపరిమితికి రూ.50 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం.
* ఆర్బీఐ ఇచ్చిన తాజా ఉపశమనంతో ఈ కాలపరిమితి 206 నెలలకు తగ్గుతుంది.
* అంటే, వడ్డీ భారం సుమారు రూ.14.78 లక్షలు ఆదా అవుతుంది.
ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాంకులు ఎంత త్వరగా ఈ ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు అందిస్తాయి అనే దానిపైనే ఈ ప్రయోజనం ఆధారపడి ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం ఇంటి కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తుందని అందరూ భావిస్తున్నారు.