https://oktelugu.com/

Ola Electric Bike : ఓలా ఎలక్ట్రిక్ బైక్ కు ఫుల్ డిమాండ్.. ఎందుకు ఎగబడుతున్నారు

ప్రభుత్వ సబ్సిడీల్లో గణనీయమైన తగ్గింపు ఉన్నప్పటికీ  స్కూటర్ ధరలను స్వల్పంగా పెంచినట్టు చెప్పారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి తమ వంతుగా సాయం అందిస్తున్నట్టు తెలిపారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 1, 2023 4:53 pm
    Follow us on

    Ola Electric Bike : ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ దూసుకుపోతోంది. అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి కనబరుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సరఫరా అగ్రస్థానంలో నిలిచేందుకు ఎప్పటికప్పుడు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. వాటిని అధిగమిస్తూ భారత్ లో తన సుస్థిర స్థానాన్ని కొనసాగించుకుంటోంది. ఒక్క మే నెలలో 35,000 యూనిట్ల ఎలక్ట్రిక్ వెర్షన్ స్కూటర్లను విక్రయించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో తన మార్కెట్ లీడర్ స్థానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది.

    ఏప్రిల్ నెలలో 30,000 యూనిట్లను విక్రయించిన ఓలా సంస్థ.. ఒక్క నెలలోనే 5 వేల యూనిట్ల విక్రయాలు పెంచుకోవడం విశేషం. దీంతో వరుసగా తొమ్మిది నెలల పాటు తన అగ్రస్థానాన్నికొనసాగిస్తుండడం అభినందనీయం.ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో ఇప్పుడు ఓలా వాటా 30 శాతానికి పైనే. గత ఏడాది మే నెలతో పోల్చుకుంటే 300 శాతం వృద్ధి సాధించింది. గత 3 త్రైమాసికాలుగా అమ్మకాల్లో నిలకడగా అగ్రస్థానంలో ఉండటం  విశేషం. భవిష్యత్ లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరగనుందనే అంశాన్ని ఆటోమోటివ్‌ నిపుణులు అంగీకరిస్తున్నారు. 2030 నాటికి కనీసం విక్రయించే వాహనాల్లో కనీసం 30 శాతం వాహనాలు ఎలక్ట్రిక్‌వి ఉండాలనే లక్ష్యంతో భారత్ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఓలా అమ్మకాల్లో రికార్డులు సాధిస్తుండడం విశేషం.

    ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ తగ్గినా.. అనూహ్యంగా అమ్మకాలు పెరగడం విశేషం. ప్రస్తుతం  ఓలా ఎస్ వన్ ప్రో  రూ. 1,39,999, ఎస్ వన్ 3కేడబ్ల్యూహెచ్ రూ.1,29,999, ఎస్ వన్ ఎయిర్ రూ.1,09,999 ధరలు అందుబాటులో ఉన్నాయి. అమ్మకాలు పెరుగుతున్న కొలదీ సబ్సిడీ తగ్గింది. కానీ ఇంజినీరింగ్,  ఇన్నోవేషన్‌తో ఓలా వినియోగదారుడికి ఆకట్టుకుంటోంది. అమ్మకాలు గణనీయంగా పెరగడానికి అదే కారణమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.

    మూడు త్రైమాసికాల్లో నిలకడగా అమ్మకాలు కొనసాగుతుండడంపై ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భావిష్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో ప్రగతి సాధ్యమైందన్నారు. ప్రభుత్వ సబ్సిడీల్లో గణనీయమైన తగ్గింపు ఉన్నప్పటికీ  స్కూటర్ ధరలను స్వల్పంగా పెంచినట్టు చెప్పారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి తమ వంతుగా సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్  దృఢ నిశ్చయంతో పనిచేస్తోందని భావిష్ అగర్వాల్ చెబుతున్నారు.