Flex Fuel Bikes In India: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ద్విచక్ర వాహనాల్లో హీరో కంపెనీకి చెందిన స్ప్లెండర్ ప్లస్ (Splendor+), హెచ్‌ఎఫ్ డీలక్స్ (HF Deluxe) ఉంటాయి. ఇవి సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండడంతో పాటు కావాల్సిన మైలేజ్ ని అందిస్తాయి. అంతేకాకుండా మెయింటనెన్స్ విషయంలోనూ పెద్దగా ఇబ్బంది పెట్టకపోవడంతో వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. అయితేఇవి ఇప్పుడు సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex-Fuel – E85) టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా, పెట్రోల్ భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వాహనాలతో పాత వాటిపై ప్రభావం పడనుందా? వాటి అమ్మకాలు కొనసాగుతాయా?
హీరో మోటోకార్ప్ ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లను ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం.. హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ను రూ.72,792 గాను, స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ను రూ.82,710 గాను ధరలను నిర్ణయించింది. సాధారణ పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే ఇవి సుమారు రూ.5,000 నుండి రూ.13,000 వరకు ప్రీమియం ధరను కలిగి ఉన్నాయి. వీటి డెలివరీలు జూలై చివరి వారం నుండి మొదటగా ఢిల్లీ, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో ప్రారంభం కానున్నాయి. కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ ప్రారంభ ఆఫర్ కింద రూ.4,000 వరకు తగ్గింపును కూడా ఇస్తోంది.
ఇథనాల్ ఇంధనం పెట్రోల్ కంటే భిన్నంగా ఉంటుంది. దీంతో హీరో కంపెనీ ఈ బైక్‌లలో దాదాపు 36 రకాల మెకానికల్ మార్పులను చేసింది. ఇందులో కొత్త ఫ్యూయల్ పంప్, సెకండరీ ఫ్యూయల్ ఫిల్టర్, అప్‌గ్రేడెడ్ ఈసీయూ ( Engine Control Unit)లను అమర్చారు. దీంతో పెట్రోల్ బైక్ కంటే ఇది 7శాతం ఎక్కువ పవర్ ను, 3 శాతం ఎక్కువ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
సాధారణ పెట్రోల్ బైక్‌లను జనం వదులుకుంటారా?
కస్టమర్లు తమ పాత పెట్రోల్ బైక్‌లను వెంటనే వదిలేసి వీటి వైపు మళ్లుతారా అంటే.. అది పూర్తిగా దేశంలో ఇథనాల్ ఇంధన లభ్యత పైనే ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త బైక్‌లు సాధారణ పెట్రోల్ (E20) నుంచి 85 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వరకు దేనితోనైనా నడవగలవు. ప్రస్తుతం సాధారణ పెట్రోల్ ధర రూ.100 కంటే ఎక్కువగా ఉండగా, భవిష్యత్తులో E85 ఇథనాల్ ఇంధనం రూ.60 నుండి రూ.70 లకే లభించే అవకాశం ఉంది. బంకుల్లో ఇథనాల్ ఇంధనం విరివిగా దొరకడం ప్రారంభమైతే, రోజువారీ ప్రయాణికులు ఖచ్చితంగా తమ పాత పెట్రోల్ బైక్‌ల స్థానంలో ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లను కొనడానికే మొగ్గు చూపుతారు.
భారత టూ-వీలర్ మార్కెట్‌పై ఈ బైక్‌ల ప్రభావం చాలా బలంగా ఉండబోతోంది. ఎందుకంటే హీరో సంస్థ ఈ ప్రయోగాన్ని ఏదో ఒక ప్రీమియం బైక్‌పై చేయకుండా, దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్ప్లెండర్, హెచ్‌ఎఫ్ డీలక్స్ లపైనే చేసింది. మిడిల్ క్లాస్ ప్రజలకు మైలేజ్ , తక్కువ ఖర్చు చాలా ముఖ్యం. ఇథనాల్ వాడకం వల్ల ఇంధన ఖర్చులు దాదాపు 30 నుండి 40శాతం వరకు తగ్గుతాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో మిగతా కంపెనీలు (హోండా, బజాజ్, టీవీఎస్) కూడా తమ 100cc బైక్‌లను ఫ్లెక్స్-ఫ్యూయల్ వేరియంట్లలో తీసుకురాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
