Faster cheque clearance: ఒకప్పుడు ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బులు పంపించాలంటే తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చేది. గంటలకు గంటలు ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్షణాల వ్యవధిలోనే డిజిటల్ విధానంలో డబ్బులు పంపించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. తద్వారా సమయం ఆదాయం అయింది. బ్యాంకుల ఎదుట పడికాపులు కాసే ఇబ్బంది తప్పింది. అయితే నేటి కాలంలోనూ చెక్కుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.
ప్రస్తుత కాలంలోనూ చెక్కులు క్లియర్ అవ్వాలంటే దాదాపు రెండు రోజుల వరకు సమయం పడుతోంది. దీనివల్ల చాలా వరకు ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోతున్నాయి. కొన్ని సందర్భాలలో నిలిచిపోతున్నాయి. ఇలాంటి క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చెక్కు క్లియరెన్స్ విషయంలో ఎదురయ్యే ఆలస్యం తగ్గనుంది. అక్టోబర్ 4 నుంచి గంటల్లోనే చెక్కు క్లియర్ కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు శనివారం నుంచి ఈ విధానాన్ని అమలు చేయబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కులు క్లియర్ చేయడానికి అయ్యే సమయాన్ని గంటల వ్యవధిలోకి తగ్గించనుంది. దీనికోసం కంటిన్యూస్ క్లియరింగ్ అనే వ్యవస్థను తెరపైకి తీసుకురానుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కంటిన్యూస్ క్లియరింగ్ అనే వ్యవస్థ ద్వారా గంటల వ్యవధిలోనే క్లియర్ అవుతుంది. చెక్కుల స్కానింగ్.. సబ్మిట్.. క్లియరెన్స్ అనేవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం నాలుగు గంటల వరకు చెక్కులను సమర్పించవచ్చు. సాయంత్రం 7 గంటల లోపు చెక్కులు మొత్తం క్లియర్ అవుతాయి. ఒకవేళ ఉదయం డిపాజిట్ చేస్తే సాయంత్రం వరకు నగదు అనేది అకౌంట్లో జమ అవుతుంది. చెక్కును యాక్సెప్ట్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం ఏదైనా సరే సాయంత్రం ఏడు గంటలకు పూర్తవుతుంది.
మొదటి దశలో సాయంత్రం ఏడు గంటలకు చెక్ క్లియరెన్స్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. రెండవ దశలో కేవలం మూడు గంటల్లోనే చెక్కు క్లియర్ అవుతుంది. అయితే రెండవ దశ అనేది వచ్చే ఏ డాది జనవరి 3 నుంచి మొదలవుతుంది. బ్యాంకులు పనిచేసే సమయాలలో ఎప్పుడు చెక్కులు సమర్పించినా మూడు గంటల వ్యవధిలోనే ఖాతాలలో నగదు జమవుతుంది. ఉదయం 10 గంటలకు చెక్కు సమర్పిస్తే మధ్యాహ్నం ఒంటిగంట వరకల్లా చెక్కు క్లియర్ అవుతుంది. వాస్తవానికి వ్యాపారులు చెక్కులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలా త్వరితగతిన క్లియరెన్స్ కావడం వల్ల సమయంతో పాటు.. డబ్బు కూడా వెంటనే ఖాతాలో జమ అవుతుంది.