Electric Two-Wheeler: భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలను ప్రభుత్వం నిలిపివేసినట్లు వస్తున్న వార్తలపై రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పందించింది. దీనిపై ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.

గత కొద్ది నెలలుగా వరుసగా ఎలక్ట్రిక్ టూ–వీలర్స్ కాలిపోతూ వాహనదారుల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఓలా సహా పలు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు పేలడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం సదరు కంపెనీలు పలు స్కూటర్‌లు రీకాల్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇండియాలో ఎలక్ట్రిక్ టూ–వీలర్స్ అమ్మకాలను బ్యాన్ చేసిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పందించింది. భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలను ప్రభుత్వం నిలిపివేసినట్లు వస్తున్న పుకార్లను ఖండించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.
Also Read: Minister Roja: ఎరక్క వచ్చి ఇరుక్కుపోయి.. అభివృద్ధి పంచాయితీ వేళ కేసీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా!
కొత్తగా ఎలాంటి ఎలక్ట్రిక్ టూ–వీలర్స్ లాంచ్ చేయకూడదని ఎలక్ట్రిక్ వెహికల్ తయారీదారులను భారత ప్రభుత్వం కోరినట్లు కొన్ని ఆన్ లైన్ నివేదికలు పేర్కొన్నాయి. ఢిల్లీలో మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొన్ని రిపోర్ట్స్ రాసుకొచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల అగ్ని ప్రమాదాలపై దర్యాప్తు చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి మరింత సమయం కావాలని ప్రభుత్వం చెప్పినట్లుగా ఇవి పేర్కొన్నాయి. అగ్ని ప్రమాదాలపై దర్యాప్తు పూర్తయ్యేవరకు కొత్త ఎలక్ట్రిక్ టూ–వీలర్స్ లాంచ్ చేయకూడదని ప్రభుత్వం ఆదేశించినట్లు కూడా పేర్కొన్నాయి. అయితే ఇవన్నీ అబద్ధమని రవాణా మంత్రిత్వ శాఖ స్వయంగా ప్రకటించింది. ఈ వాదనలను నిరాధారమైనవి కొట్టిపారేసింది.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వస్తున్న పుకార్లను పటాపంచలు చేసింది. ఇది తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ‘‘అగ్ని ప్రమాదం జరిగిన సందర్భాలను పరిశోధించే వరకు కొత్త వాహనాలను లాంచ్ చేయవద్దని రవాణా మంత్రిత్వ శావఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులను కోరినట్లు మీడియాకి చెందిన ఒక విభాగం నివేదించింది. అలాంటి ఆదేశాలు, సూచనలేవీ మంత్రిత్వ శాఖ చేయలేదు. ఇలాంటి నివేదికలు నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి, సత్యానికి దూరంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేయాలనుకుంటున్నది‘ అని పేర్కొంది.

ఇటీవల, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అగ్నిప్రమాదాలు చాలా చోటు చేసుకున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల వాహన తయారీదారుల తప్పు ఉన్నట్లు తేలితే భారీ జరిమానాలను విధిస్తామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రీకాల్ జారీ చేసి, ఈలోగా తమ ఉత్పత్తుల్లో లోపాలను పరిష్కరించుకోవచ్చని మంత్రి సూచించారు. ‘ఏదైనా కంపెనీ తమ ప్రక్రియల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, భారీ జరిమానా విధించడం జరుగుతుంది. లోపాలున్న వాహనాలను రీకాల్ చేయాలని కూడా ఆదేశించడం జరుగుతుంది’ అని గడ్కరీ చెప్పారు. ఒకినావా, ప్యూర్‌ఈవీ, ఓలా ఎలక్ట్రిక్ తదితర కంపెనీల బైక్స్ ఇప్పటికే అగ్ని ప్రమాదాలకు గురయ్యాయి. దీంతో ఈ కంపెనీలు తమ స్కూటర్లను చెక్ చేసేందుకు రీకాల్ చేశాయి. గురుగ్రామ్‌కు చెందిన ఓకినావా ఆటోటెక్ ఈ నెల ప్రారంభంలో 3,215 వాహనాలను, హైదరాబాద్‌కు చెందిన పవర్ యూజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ మరో 2 వేల వాహనాలను రీకాల్ చేసింది.
అమ్మకాలపై ప్రభావం..
వరుస అగ్ని ప్రమాదాల ప్రభావం ఎలక్ట్రిక్ టూ–వీలర్స్‌పై పడింది. పెట్రోల్ ధరలు పెరుగుతన్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ టూ–వీలర్స్‌కు దేశ మార్కెటలలో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో చాలా కంపెనీలు వాహనాల తయారీపై దృషి పెట్టాయి. అయితే తయారీ సమయంలో భారత వాతావరణ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాహన తయారీ కంపెనీలు వివిధ వాతావరణ పరిస్థితులు, రోడ్ల పరిస్థితి, వాహనం నుంచి జనరేట్ అయ్యే ఉష్ణోగ్రత, బయటి ఉష్ణోగ్రత, వేసవిలో ఉండే వేడి ఇలా అన్నీ అంచనా వేయాల్సి ఉంటుంది. అన్నిటినీ తట్టుకునేలా వాహనం రూపొందించాల్సి ఉటుంది. అయితే చాలా కంపెనీలు డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు హడావుడిగా వాహనాలను మార్కెటలోకి విడుదల చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత వేసవిలో వాహనాలు కాలిపోతున్నాయని, షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నితిన్‌గట్కరీ సైతం స్పందించి రికాల్‌కు అవకాశం ఇచ్చారు. రీకాల్ తర్వాత అయినా సురక్షిత వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఇప్పటికే అగ్నిప్రమాదాలు, రీకాల్ నేపథ్యంలో వాహనాల అమ్మకాలు 50 శాతం పడిపోయాయి.
Also Read:Machilipatnam: తండ్రి స్థానంలో ఉన్న వాడే కీచకుడిగా మారితే..
[…] Also Read: బ్యాన్ కాదు.. రీకాల్ మాత్రమే! ఎలక్ట్… […]