Anant Ambani Wedding: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ ఉండదు. అలాగే శ్రీమంతుడు తలుచుకుంటే ఖర్చుకు లెక్క ఉండదు. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద శ్రీమంతుడు, ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధికా మర్చంట్ పెళ్లి ఖర్చు కూడా ఆ సామెత తీరుగానే ఉండబోతోంది.. ఇప్పటికే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలు గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ప్రపంచం నలుమూలల నుంచి అతిరథ మహారధులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు హాజరయ్యారు. అంతర్జాతీయ స్థాయి కళాకారులు ముందస్తు పెళ్లి వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. మూడు రోజులపాటు ఈ ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి ముకేశ్ అంబానీ కని విని ఎరుగని స్థాయిలో ఏర్పాటు చేశారు. అతిధుల కోసం 2,500 రకాల వంటకాలను సిద్ధం చేశారు..
ముందస్తు పెళ్లి వేడుకలే ఈ స్థాయిలో జరిగితే.. ఇక పెళ్లి వేడుకలు ఎలా జరుపుతారోననే చర్చ దేశవ్యాప్తంగా నడుస్తోంది. ముందస్తు పెళ్లి వేడుకలకే ముకేశ్ అంబానీ వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జామ్ నగర్ ప్రాంతంలో 12 ఆలయాలను నిర్మించారు. కొత్త రోడ్లు ఏర్పాటు చేశారు. అతిధుల కోసం ఆల్ట్రా లగ్జరీ టెంట్లు నిర్మించారు. అక్కడ సకల సౌకర్యాలు కల్పించారు. అతిథుల కోసం ప్రత్యేకంగా విమానాలు కూడా ఏర్పాటు చేశారు. అంతకుముందు వేలాదిమందికి అన్నదానం చేశారు. ఇలా కేవలం ముందస్తు పెళ్లి వేడుకలకే ముకేశ్ అంబానీ కుటుంబం వందల కోట్లు ఖర్చు చేసింది. మరి పెళ్లికి.. అక్కడికే వస్తున్నాం.
ముకేశ్ అంబానీ ఇంట్లో అనంత్ అంబానీ చిన్నవాడు. ప్రస్తుత తరానికి సంబంధించి ఆయన ఇంట్లో జరిగే చివరి వేడుక ఇదే. ఈ వేడుకను అత్యంత ఘనంగా జరపాలని ముఖేష్ అంబానీ కుటుంబం నిర్ణయించింది. అందుకే ఈ వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలని ముకేశ్ అంబానీ సంకల్పించారు. ఈ క్రమంలో జూలైలో జరిగే అనంత్- రాధిక పెళ్లి కోసం ఏకంగా 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే అతిథుల కోసం ఖరీదైన బహుమతులు, ఆద్యంతం గుర్తుండిపోయేలా వంటకాలు, సకల సౌకర్యాలతో పెళ్లి వేడుక జరపనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ 113 బిలియన్ డాలర్లు. దాంతో పోల్చితే అనంత్ అంబానీ పెళ్లి ఖర్చు అందులో 0.1% మాత్రమే. ఇక ముందస్తు పెళ్లి వేడుకల నేపథ్యంలో ఆకాష్ – రాధిక జోడి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.