Disney And Reliance: ముఖేష్ అంబానీ రెండవ కొడుకు అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకల సందడి మొదలైంది. ఈ వేడుకలు రేపటి నుంచి ప్రారంభవుతాయి. ఆదివారంతో ముగుస్తాయి. ఈ వేడుకలు జరిగే జామ్ నగర్ ప్రాంతం ఇప్పటికే హడావిడిగా మారింది. మరోవైపు రోజుకో కార్యక్రమంతో ముకేశ్ అంబానీ కుటుంబం సందడి చేస్తోంది. ఈ సందడి ఇలా ఉండగానే ముకేశ్ అంబానీ కుటుంబం పలు వ్యాపారాలలో కొత్త ఒప్పందాలతో మార్కెట్ ను షేక్ చేస్తోంది. వాల్ట్ డిస్నీ తో ఒప్పందం కుదుర్చుకొని అతిపెద్ద మీడియా సంస్థగా రిలయన్స్ అవతరించనుంది. బుధవారం ఇందుకు సంబంధించి చర్చలు పూర్తికాగానే.. రిలయన్స్ సంబంధించిన మరో విషయం మార్కెట్ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది.
టెలికాం రంగంలో కొన్ని సంవత్సరాల క్రితం జియో ద్వారా ప్రవేశించిన ముఖేష్ అంబానీ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఈ టెలికాం రంగంలో బిగ్ ప్లేయర్ గా ఉన్న భారతీ ఎయిర్ టెల్ ను దాదాపు ఢీ కొట్టినంత పని చేశారు. ఈ క్రమంలో 5జీ విభాగంలో ముఖేష్ అంబానీ మరో ప్రయోగం చేస్తున్నారు. ప్రముఖ చిప్ మేకింగ్ సంస్థ క్వాల్ కామ్ తో జట్టు కడుతున్నారు. ఈ సంస్థతో కలిసి ఎంట్రీ లెవెల్ 5 జీ – స్మార్ట్ ఫోన్ తయారీపై కసరత్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 5 జీ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తున్న రిలయన్స్ జియో.. 2024 ముగింపు నాటికి భారత విపణిలో 5 జీ ఎంట్రీ లెవెల్ ఫోన్ ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ధర 99 డాలర్లు. మన దేశ కరెన్సీలో 8,200గా ఉంటుందని ఒక అంచనా.
వాస్తవానికి మన దేశ టెలికాం మార్కెట్లో మధ్యతరగతి వారే ఎక్కువ. అయితే వీరిని దృష్టిలో పెట్టుకొని రిలయన్స్, క్వాల్ కామ్ చౌక ధరకే 5 జీ ఫోన్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్ కొన్న వారికి జియో ఆఫర్లు లభిస్తాయి. అంతేకాదు 4 జీ సేవలు పొందే వినియోగదారులను 5 జీ వైపు మళ్లించాలని చూస్తున్నామని జియో, క్వాల్ కామ్ వర్గాలు చెబుతున్నాయి. “మా నిర్ణయంతో భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల మంది ప్రజలకు 5 జీ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నామని” జియో, క్వాల్ కామ్ వర్గాలు అంటున్నాయి.
దేశవ్యాప్తంగా టెలికాం మార్కెట్ కు మెరుగైన అవకాశాలు ఉన్న నేపథ్యంలో 5 జీ సేవలను రిలయన్స్ జియో అంతకంతకు విస్తరిస్తోంది. మార్కెట్ అవసరాల దృష్ట్యా తక్కువ ధరలోనే 5 జీ స్మార్ట్ ఫోన్ తీసుకురావాలని క్వాల్ కామ్, జియో నిర్ణయించాయి. ఇక ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ కనీస ధర 7000 గా ఉంది. అయితే ఈ ఫోన్లన్నీ కేవలం 4 జీ సేవలను మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 5 జీ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో 8 వేల కనీస ధరతో స్మార్ట్ ఫోన్ తీసుకురావాలని జియో, క్వాల్ కామ్ భావిస్తున్నాయి. ఈ ఫోన్.. మార్కెట్ రూపురేఖలు మొత్తం సమూలంగా మార్చేస్తుందని ఆ రెండు సంస్థలు అంచనా వేస్తున్నాయి.. గతంలో జియో తక్కువ ధరకే ఫీచర్ ఫోన్ ప్రవేశపెట్టింది. అందులో యూట్యూబ్ చూసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అప్పట్లో ఈ ఫోన్ ఒక సంచలనంగా మారింది. ఇప్పుడు క్వాల్ కామ్ తో జట్టు కట్టడం ద్వారా 5 జీ మార్కెట్ దున్నేయాలని జియో భావిస్తోంది. అన్నట్టు ఈ ఫోన్లు కేవలం భారత దేశంలో మాత్రమే కాకుండా.. ఇతర వర్థమాన దేశాలకు కూడా ఎగుమతి చేయాలని జియో, క్వాల్ కామ్ భావిస్తున్నాయి. తక్కువ ధరలో 5g స్మార్ట్ ఫోన్ తీసుకొస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ” ఇన్ని రకాల వ్యాపారాలతో వరల్డ్ రిచెస్ట్ బిజినెస్ మాన్ గా ముకేశ్ అంబానీ ఎదుగుతాడేమోనని” సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.