దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు సగటున దేశంలో మూడున్నర లక్షల కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావడం మంచిదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కరోనా విజృంభణ వల్ల పలు రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి.
కేసుల సంఖ్య మరింత పెరిగితే మాత్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత వల్ల పలు రాష్ట్రాల్లో కొంతమంది కరోనా రోగులు మృతి చెందుతున్నారు. వేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
కార్మికుల బ్యాంక్ అకౌంట్లలో ఏకంగా 5 వేల రూపాయలు జమ చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే సగం మంది కార్మికుల ఖాతాలలో నగదు జమ కాగా మిగిలిన వాళ్ల బ్యాంక్ ఖాతాలలో కూడా త్వరలో నగదు జమ కానుందని సమాచారం. ఎవరైతే లేబర్ బోర్డులో రిజిష్టర్ చేసుకుంటారో వారు మాత్రమే ఈ డబ్బును పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కార్మికులు ప్రశంసిస్తున్నారు.
ఢిల్లీ ప్రభుత్వం కన్‌స్ట్రక్షన్ వర్కర్లకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే పాఠశాలలలో, కన్‌స్ట్రక్చన్ సైట్ల దగ్గర పని చేస్తూ ఉంటారో వారి కొరకు ఢిల్లీ ప్రభుత్వం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.