Delhi EV Policy 2.0: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం Delhi EV Policy 2.0 (2026-2030) ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాల కొనుగోలుకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. రోడ్లపై పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్యను తగ్గించి 2030 నాటికి ఢిల్లీని గ్రీన్ మొబిలిటీ నగరంగా మార్చడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. ఈ పాలసీ ద్వారా కార్లు కొనేవారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఎంత వరకు డబ్బు ఆదా అవుతుంది?
ఈ కొత్త ఢిల్లీ పాలసీ ప్రకారం.. రూ. 30 లక్షతల లోపు ఎక్స్ షోరూమ్ ధర ఉన్న ప్రతి బ్యాటరీ ఎలక్ట్రిక్ కారుకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల నుండి 100% పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఈ నిర్ణయం వల్ల కొనుగోలుదారులకు ఆన్ రోడ్ ధరపై నేరుగా రూ. 1.5 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు ఆర్థిక ఉపశమనం కలుగుతుంది. తమ కుటుంబం కోసం మొదటి లేదా రెండవ కారుగా ఈవీని ఎంచుకోవాలని చూస్తున్న వారికి ఈ ఆఫర్ ఒక గొప్ప ప్రోత్సాహకంగా నిలుస్తుంది.
ఈ సరికొత్త ఈవీ విధానం జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. మార్చి 31, 2030 వరకు కొనసాగుతుంది. ఈ పాలసీ వల్ల అన్నింటికంటే ఎక్కువగా లబ్ధి పొందేవి ఫోర్ వీలర్స్ కావడం విశేషం. అయితే, కొనుగోలుదారులు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వంద శాతం పన్ను మినహాయింపు కేవలం పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వాహనాలకు ఈ రాయితీలు వర్తించవు.
భారతదేశంలో అత్యంత నమ్మదగిన, బడ్జెట్ అనుకూల ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం రూ. 15 లక్షల విభాగంలోనే అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రయోజనాలన్నింటినీ అందుకోవడానికి మార్కెట్లో ప్రస్తుతం ఎనిమిది ప్రముఖ మోడళ్లు రేసులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా టాటా టియాగో ఈవీ (Tata Tiago EV), ఎమ్‌జీ కామెట్ ఈవీ (MG Comet EV), టాటా పంచ్ ఈవీ (Tata Punch EV), సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ (Citroen eC3X), టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), మహీంద్రా ఎక్స్ యూవీ 3 ఎక్స్ వో ఈవీ(Mahindra XUV3XO EV) ప్రముఖంగా ఉన్నాయి.
పన్ను మినహాయింపులతో పాటు, పాత వాహనాలను వదిలించుకోవాలనుకునే వారికి ప్రభుత్వం అదనపు గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరైనా తమ పాత BS-IV లేదా అంతకంటే పాత ఢిల్లీ-రిజిస్టర్డ్ పెట్రోల్ లేదా డీజిల్ కారును స్క్రాప్ (రద్దు) చేసి, ఆ తర్వాత ఆరు నెలల లోపు అర్హత గల కొత్త ఈవీని కొనుగోలు చేస్తే.. వారికి రూ. 1 లక్ష వరకు అదనపు స్క్రాపింగ్ ప్రోత్సాహకం లభిస్తుంది. అయితే, ఈ అదనపు లబ్ధి కేవలం మొదటి ఒక లక్ష మంది దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది.
