గత కొంతకాలంగా నునె ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో పెరుగుతున్న ధరల వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సంవత్సర కాలంలోనే వంటనూనె ధరలు 35 శాతం నుంచి 95 శాతం వరకు పెరిగాయి. అయితే ఇప్పటికే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న వంటనూనె ధర మరింత పెరిగినట్లు తెలుస్తోంది.
లీటర్ పామాయిల్ ధర ఏకంగా 140 రూపాయలకు పెరగగా ఆవ నూనె ధర లీటర్ 150 రూపాయలకు చేరింది. సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ధరలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూనె ధరలను తగ్గించడం లేదా రేషన్ సరుకులలో భాగంగా వంటనూనెను ఇస్తే బాగుంటుందని సామాన్య ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నూనె ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం సుంకాలను తగ్గిస్తే నూనె ధరలు తగ్గుతాయని ప్రజలు భావిస్తున్నారు. వ్యాపారులు మాత్రం నూనె ధరలు ఇప్పట్లో తగ్గవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధరలు వేగంగా పెరుగుతుంటే ప్రజల ఆదాయం మాత్రం అదే స్థాయిలో పెరగడం లేదు. గత ఏడాది మార్చి నెలలో లీటర్ పామాయిల్ ధర 80 రూపాయలకు అటూఇటుగా ఉండగా ఆవ నూనె ధర 90 రూపాయల నుంచి 95 రూపాయల మధ్యలో ఉండేది.
ధరలు పెరిగినంత వేగంగా ఆదాయం పెరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న వంటనూనె ధరల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాల్సి ఉంది