కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న స్కీమ్ లలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ నెల మొదటి వారంలోనే రైతుల ఖాతాలలో ఈ స్కీమ్ నగదు జమ కావాల్సి ఉండగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో ఈ స్కీమ్ నగదును రైతుల ఖాతాలలో జమ చేయాలని భావిస్తోంది.
త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ స్కీమ్ కు సంబంధించిన నగదు జమ కానుంది. ప్రతి సంవత్సరం మూడు విడతల్లో 6,000 రూపాయల చొప్పున కేంద్రం ఈ స్కీమ్ నగదును రైతుల ఖాతాలలో జమ చేస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు అర్హులైన రైతుల ఖాతాలలో ఏడు విడతల నగదు జమ కాగా త్వరలో ఎనిమిదో విడత నగదు జమ కానుంది. అయితే కేంద్రం ఇకపై కొంతమంది రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నగదును జమ చేయదని సమాచారం.
సాగు చేసే వారి పేరుపై పొలం ఉంటే మాత్రమే ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందవచ్చు. సాగు చేసే వ్యక్తి తల్లి, తండ్రి పేర్లపై పొలం ఉంటే మాత్రం ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందడం సాధ్యం కాదు. పొలాన్ని సాగు చేయని వారు, ఇతర అవసరాల కోసం పొలాన్ని వినియోగించే వారు కూడా డబ్బులను పొందలేరు. రిజిస్ట్రేషన్ ఫామ్‌లో తప్పులు ఉంటే కూడా పీఎం కిసాన్ డబ్బులను పొందడం సాధ్యం కాదు.
ప్రభుత్వ ఉద్యోగులకు పొలం ఉంటే వాళ్లు కూడా ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందలేరు. డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, సీఏ, ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్ పదవుల్లో ఉన్నవారు కూడా పీఎం కిసాన్ స్కీమ్ కు అర్హులు కాదు.