Palnadu: ఎవరైనా పుండు మీద మందు రాస్తారు.. కానీ ఒళ్లంతా రాసినట్టు ఉంది ఓ వ్యక్తి వ్యవహారం. ఎదురింటి వాడితో గొడవపడి ఏకంగా రోడ్డుపైనే గోడ కట్టేశాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఏకంగా కొన్ని మీటర్ల పాటు రోడ్డుకు మధ్యలో సిమెంట్ ఇటుకలతో గోడ నిర్మించాడు. ఈ విషయంలో ఎవరు చెప్పినా ఆయన వినకపోవడం విశేషం.
పల్నాడు జిల్లా శావల్యపురం మండలం కారుమంచి గ్రామంలో ఓ ఇంటి యజమాని ఎదురింటి వ్యక్తితో గొడవ పడి రోడ్డును నిర్మించేశాడు. కిలారు లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ కు చెందిన ఇళ్లు ఎదురెదురుగా ఉంటాయి. గతంలో చాలాసార్లు వీరి మధ్య వివాదాలు నడిచాయి. గృహ నిర్మాణానికి సంబంధించి అభ్యంతరాలు నడిచాయి. దీంతో పంచాయితీలు జరగడం, ఇరువురి మధ్య చర్చలు జరిపి రాజీ వంటివి పూర్తయ్యాయి. కానీ వారి మధ్య పాత పగలు మాత్రం వీడలేదు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, అభ్యంతరాలు కొనసాగుతున్నాయి.
గతంలో లక్ష్మీనారాయణ రోడ్డు మీదకు వచ్చేలా మెట్లు కట్టాడని చంద్రశేఖర్ అభ్యంతరం తెలిపాడు. అప్పట్లో గ్రామ పెద్దలు, పోలీసులు, పంచాయతీ సిబ్బంది ఇద్దరికీ రాజీ కుదిర్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల చంద్రశేఖర్ తన ఇంటి ఎదుట మురుగు కాలువపై మెట్లు కట్టాడు. దీనికి నిరసనగా లక్ష్మీనారాయణ ఏకంగా ఇంటి ముందున్న సిమెంట్ రోడ్డుపై గోడ నిర్మించాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రోల్ చేస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది. గోడను తీసే ఏర్పాట్లు చేస్తుంది.