Homeబిజినెస్Car Loan EMI: కార్ లోన్ EMI మిస్ అయ్యిందా... వాహనాన్ని ఎప్పుడు సీజ్ చేస్తారు..

Car Loan EMI: కార్ లోన్ EMI మిస్ అయ్యిందా… వాహనాన్ని ఎప్పుడు సీజ్ చేస్తారు..

Car Loan EMI: ప్రస్తుతం చాలా మంది కారు కొనుగోలు చేయడానికి బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. నెలవారీ ఈఎంఐల రూపంలో రుణాన్ని తిరిగి చెల్లించడం ఈ ఒప్పందంలో కీలక భాగం. అయితే ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టాలు, అనారోగ్యం వంటి అనుకోని పరిస్థితుల వల్ల కొన్నిసార్లు ఈఎంఐలు సకాలంలో చెల్లించలేకపోవచ్చు. అలాంటి సమయంలో ‘బ్యాంకు కారు లాక్కెళ్తుందేమో’ అనే భయం చాలా మందిని వెంటాడుతుంది. కానీ చట్టం ప్రకారం బ్యాంకులు కూడా కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు ఏవో చూద్దాం..

ఒకటి లేదా రెండు నెలల ఈఎంఐలు చెల్లించలేదనే కారణంతో బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ వెంటనే మీ కారును స్వాధీనం చేసుకోలేదు. సాధారణంగా మొదట కస్టమర్‌కు ఫోన్ కాల్స్, SMSలు, ఈ-మెయిల్స్ లేదా లిఖితపూర్వక నోటీసుల ద్వారా బకాయిలు చెల్లించాలని గుర్తు చేస్తారు. ఈ దశలో కస్టమర్‌తో మాట్లాడి సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు.

సాధారణంగా వరుసగా మూడు ఈఎంఐలు బకాయి పడితే రుణ ఖాతా డిఫాల్ట్ దిశగా వెళ్లినట్లుగా బ్యాంకులు పరిగణించవచ్చు. ఆ తర్వాత కూడా బకాయిలు చెల్లించకపోతే బ్యాంకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంటుంది. అయితే ఇది కూడా వెంటనే వాహనం సీజ్ చేస్తారనే అర్థం కాదు. ముందుగా నోటీసులు ఇవ్వడం, బకాయిలు చెల్లించేందుకు అవకాశం కల్పించడం వంటి విధానాలను అనుసరించాలి.

రికవరీ ఏజెంట్లు తమ ఇష్టానుసారం వ్యవహరించడానికి చట్టం అనుమతించదు. బెదిరించడం, దుర్భాషలాడడం, బలవంతంగా వాహనం లాక్కోవడం, కుటుంబ సభ్యులను వేధించడం వంటి చర్యలు చట్టవిరుద్ధం. రికవరీ ప్రక్రియ మర్యాదపూర్వకంగా, నిబంధనలకు అనుగుణంగా జరగాలని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఏజెంట్లు తమ గుర్తింపు వివరాలు చూపించాలి. అనుచిత ప్రవర్తనపై బాధితులు సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయవచ్చు.

ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకు ముందుగా డిమాండ్ నోటీసు జారీ చేస్తుంది. అందులో బకాయి మొత్తం, చెల్లించాల్సిన గడువు వంటి వివరాలు ఉంటాయి. కస్టమర్ స్పందించకపోతేనే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే సరైన సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా వాహనాన్ని తీసుకెళ్లడం సాధారణంగా నిబంధనలకు విరుద్ధం.

సీజ్ చేసిన వాహనాన్ని బకాయి ఈఎంఐలు, జరిమానాలు, ఇతర చార్జీలు చెల్లించి కారును తిరిగి పొందే అవకాశం చాలా సందర్భాల్లో ఉంటుంది. ఇందుకోసం సంబంధిత బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీని వెంటనే సంప్రదించాలి. ఆలస్యం చేస్తే బ్యాంకు నిబంధనల ప్రకారం వాహనాన్ని వేలం వేసే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే బ్యాంకును ముందుగానే సంప్రదించడం ఉత్తమ మార్గం. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు రుణ పునర్వ్యవస్థీకరణ , EMI గడువు మార్పు లేదా తాత్కాలిక ఉపశమనానికి సంబంధించిన అవకాశాలను పరిశీలిస్తాయి. సమస్యను దాచిపెట్టడం కంటే ముందుగానే బ్యాంకుతో మాట్లాడితే పరిష్కారం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular