కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను మరో ఐదు నెలలపాటు పొడిగించాలన్న మోదీ నిర్ణయానికి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 81.35 కోట్ల మంది నిరుపేదలకు కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా రేషన్ అందనుంది.
కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా లబ్ధిపొందుతున్న పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ను రెండు నెలల వరకు పొడిగించడం గమనార్హం. అయితే ఈ రెండు నెలలతో పాటు మరో ఐదు నెలలు అదనంగా కేంద్రం ఈ స్కీమ్ ను పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ గరీబ్ కల్యాణ్ యోజనను దీపావళి వరకు పొడిగిస్తున్నట్టు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ప్రధాని నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు పథకం పొడిగింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆహారధాన్యాల సరఫరాను మరో ఐదు నెలలపాటు అదనంగా కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ప్రకటనను విడుదల చేయడం గమనార్హం. ఈ స్కీమ్ కింద ఒక్కొక్క లబ్ధిదారునికి కేంద్రం నెలకు 5 కిలోల చొప్పున ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయనుంది.
రేషన్ దుకాణాల ద్వారా ఒక్కొక్కరికి కిలో రూ. 13 చొప్పున సబ్సిడీ రూపంలో ఇస్తున్న ఆహారధాన్యాలకు కేంద్రం ఈ ఆహార ధాన్యాలు అదనమని వెల్లడించింది.