BYD : ఎలక్ట్రిక్ కార్లు, లేటెస్ట్ టెక్నాలజీతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ BYD. తాజాగా తమ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫారమ్‌ను విడుదల చేసింది. ఈ కొత్త టెక్నాలజీతో తమ ఎలక్ట్రిక్ కార్లు కేవలం 5 నిమిషాల్లో 400 కిలోమీటర్లు ప్రయాణించేంత ఛార్జ్ అవుతాయని కంపెనీ ధీమాగా చెబుతోంది. ఇది దాదాపుగా ఒక ఫ్యూయల్ స్టేషన్‌లో పెట్రోల్ లేదా డీజిల్ నింపడానికి పట్టే సమయానికి సమానంగా ఉంటుంది.
సూపర్ ఈ-ప్లాట్‌ఫారమ్‌గా పిలువబడే BYD కొత్త EV ప్లాట్‌ఫారమ్‌లో కొత్తగా రూపొందించిన బ్లేడ్ బ్యాటరీ ప్యాక్‌ను ఇందులో ఉపయోగించారు. ఈ టెక్నాలజీ 10C వరకు ఛార్జింగ్ మల్టిప్లయర్‌ను ఉపయోగిస్తుంది. ఈ కొత్త ఆర్కిటెక్చర్ 1,000 kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.BYD కొత్త సూపర్ ఈ-ప్లాట్‌ఫారమ్ రాబోయే కాలంలో గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో ఒక పెద్ద విప్లవాన్ని తీసుకుని రాగలదు. ఈ ప్లాట్‌ఫారమ్ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న అతి పెద్ద సమస్యకు పరిష్కారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది టెస్లా వంటి పోటీదారులకు సవాలు విసురుతుంది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌ను తమ అనేక ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగిస్తామని BYD సంకేతాలు ఇచ్చింది. ఈ ఆవిష్కరణ BYDని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో దోహదపడుతుంది.
Also Read : అసలేంటి చైనా బీవైడీ కార్లు.. టెస్లాను మించి వీటిలో ప్రత్యేకతలేంటి?
BYD ప్రారంభ దశలో ఈ కొత్త టెక్నాలజీతో కూడిన ఛార్జింగ్ స్టేషన్‌లను చైనాలో ఏర్పాటు చేస్తుంది. భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా దీనిని విస్తరించే అవకాశం ఉంది. మన దేశంలో కూడా BYD ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఈ టెక్నాలజీ మనదేశానికి వస్తే.. అది ఇతర కంపెనీలకు ఒక సవాలుగా మారుతుంది. ఆవిష్కరణల యుగంలో భారత్ లేదా ఇతర విదేశీ కంపెనీలు ఈ సవాలును ఎదుర్కోవడానికి కొత్త టెక్నాలజీలను తప్పనిసరిగా అందిపుచ్చుకోవాలి. దీని వలన ఈవీ రంగం లాభపడుతుంది. ఇదే ఫలితంగా బెంగళూరుకు చెందిన ఎనర్జీ-టెక్ స్టార్టప్ ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ BYDకి పోటీగా ప్రపంచంలోనే మొట్టమొదటి 1.5 MW అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ను ప్రారంభించడానికి రెడీ అవుతుంది. ఈ విధమైన ఆవిష్కరణలు ఇండియా వంటి దేశాలలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్‌ను వేగంగా పెంచుతాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఛార్జింగ్‌కు పట్టే ఎక్కువ సమయం కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు కొనడానికి వెనుకాడుతున్నారు. అమ్మకాల విషయంలో BYD ఇప్పటికే టెస్లాను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇది టెస్లా అమ్మకాలపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు.
Also Read : సేల్స్ లో దూసుకుపోతున్న BYD.. ఒక్క నెలలోనే రికార్డు అమ్మకాలు..