BYD : చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) తయారీ సంస్థ బీవైడీ (BYD) త్వరలో ఇండియాలో సొంత తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇప్పటికే బీవైడీ భారతీయ మార్కెట్‌లో దిగుమతి చేసుకున్న ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను సరసమైన ధరలకు విక్రయిస్తూ తన ఉనికి చాటుకుంది. అయితే, దిగుమతి కారణంగా బీవైడీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి.
Also Read : మహీంద్రా కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్..
తాజాగా వెలువడిన మీడియా కథనాల ప్రకారం.. బీవైడీ ఇండియాలో ఒక భారీ తయారీ యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ సమీపంలో ఒక భారీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బీవైడీ యోచిస్తోంది. ఇది నిజమైతే, దేశంలో బీవైడీ మొట్టమొదటి తయారీ యూనిట్ ఇదే అవుతుంది. ప్రస్తుతం బీవైడీకి తమిళనాడులో ఒక చిన్న అసెంబ్లీ యూనిట్ ఉంది. ఇక్కడ కంపెనీ తన ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తోంది.
హైదరాబాద్‌లో భూమి కోసం అన్వేషణ
అక్టోబర్ 2024లోనే బీవైడీ దేశీయంగా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని చూస్తోందనే వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అప్పుడు అందుబాటులో లేవు. తాజా నివేదికల ప్రకారం.. బీవైడీ భారత్ లో ఉత్పత్తి యూనిట్ కోసం హైదరాబాద్‌లో దాదాపు రూ. 85,000 కోట్ల ($10 బిలియన్లు) పెట్టుబడి పెట్టే యోచనలో ఉంది. అయితే, ఈ విషయంపై బీవైడీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ప్లాంట్
కంపెనీ తన తయారీ ప్లాంట్ కోసం తెలంగాణలో స్థలం కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ఇండియాలోని ఈ ప్లాంట్ 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండనుంది. ఈ ప్లాంట్‌లో 2032 నాటికి సంవత్సరానికి 6 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. అంతేకాకుండా, బీవైడీ 20 GWh సామర్థ్యంతో ఒక బ్యాటరీ ఉత్పత్తి యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసే పనిలో ఉంది.
భారత్‌లో బీవైడీ విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్లు
ప్రస్తుతం బీవైడీ భారతదేశంలో eMax7 MPV, Atto 3 SUV, Seal సెడాన్, Sealion 7 క్రాస్‌ఓవర్ వంటి 5 మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ. 24.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. బీవైడీ చాలా కాలంగా భారతీయ మార్కెట్‌లో ఉనికిని కలిగి ఉంది. గతేడాది కంపెనీ దేశవ్యాప్తంగా 27 డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. ఈ సంవత్సరం చివరి నాటికి 47 అవుట్‌లెట్‌లను తెరవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన నగరాల్లో తమ ఉనికిని కొనసాగిస్తూనే, టైర్ II నగరాల్లోకి కూడా ప్రవేశించాలని కంపెనీ యోచిస్తోంది. బీవైడీ హైదరాబాద్‌లో భారీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
Also Read : కొత్త ఇంజిన్, అప్డేటెడ్ ఫీచర్స్.. మరింత ఎట్రాక్టివ్‌గా ఎంజీ ఆస్టర్