Safest Cars in India: మన దేశంలో కారును కొనుగోలు చేసే వినియోగదారులు వాటి సేఫ్టీ పై దృష్టి పెడుతున్నారు. ఏ కారును కొనుగోలు చేసినా, భద్రత విషయంలో అది టాప్ ప్లేసులో ఉండాలి. అందుకే, కొత్త కారు కొనేటప్పుడు ముందుగా సేఫ్టీ రేటింగ్‌ను తప్పకుండా తనిఖీ చేయాలి. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దలు, పిల్లల భద్రత విషయంలో అత్యధిక పాయింట్లు సాధించిన 5 కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
1. కియా సిరోస్ (Kia Syros)
కియా ఈ సరికొత్త కారు కూడా భద్రత విషయంలో టాప్ ప్లేసులో ఉంది. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారుకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. అడల్ట్ సేఫ్టీలో 32కి 30.21 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 49కి 44.42 పాయింట్లు సాధించింది. ఈ కారు ధర రూ.9.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ.16.80 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. పెద్దలు, పిల్లల భద్రత పాయింట్లను కలిపి చూస్తే ఈ కారు మొత్తం 74.63 పాయింట్లు సాధించింది.
2. స్కోడా కైలాక్ (Skoda Kylaq)
స్కోడా ఈ కారులో సేఫ్టీ కోసం లెవెల్ 2 ADAS ఫీచర్ అందుబాటులో ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ పెద్దల సేఫ్టీలో 32కి 30.88 పాయింట్లు, పిల్లల సేఫ్టీలో 49కి 45 పాయింట్లు సాధించింది. ఈ కారు ధర రూ.8.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.13.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ కారు మొత్తం 75.88 పాయింట్లు సాధించింది.
3. మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx)
మహీంద్రా పాపులారిటీ పొందిన ఎస్‌యూవీ కూడా సేఫ్టీ విషయంలో అద్భుతమైనదనే చెప్పాలి. 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు పెద్దల భద్రతలో 32కి 31.09 పాయింట్లు, పిల్లల భద్రతలో 49కి 45 పాయింట్లు సాధించింది. ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి రూ.12.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ.23.29 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
4. మహీంద్రా బీఈ 6 (Mahindra BE 6)
మహీంద్రా ఈ సరికొత్త కారు పెద్దల భద్రతలో 32కి 31.97 పాయింట్లు, పిల్లల భద్రతలో 49కి 45 పాయింట్లు సాధించింది. 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.19.65 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ.27.65 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
5. మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ (Mahindra XEV 9e)
5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మహీంద్రా ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మార్కెట్‌లో తన అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్, ధర, సేఫ్టీ ఫీచర్లు, పనితీరు కారణంగా సంచలనం సృష్టిస్తోంది. అడల్ట్ సేఫ్టీలో ఈ కారు 32కి 32 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 49కి 45 పాయింట్లు సాధించింది. ఈ కారు ప్రారంభ ధర రూ.22.65 లక్షల (ఎక్స్-షోరూమ్), టాప్ మోడల్‌కు రూ.31.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కార్లు సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తాయని భారత్ NCAP టెస్ట్‌లు నిరూపించాయి. కొత్త కారు కొనేటప్పుడు ఈ వివరాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.