https://oktelugu.com/

Buy Car: ఎలక్ట్రిక్‌ Vs డీజిల్ కారు VS పెట్రోల్‌ కారు – ఏది బెస్ట్ ?

పెట్రోల్ కారుతో పోలిస్తే, ఎలక్ట్రిక్ వాహనం ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల సామాన్య వినియోగదారులు కొనడం కష్టమే అని చెప్పవచ్చు.

Written By:
  • Rocky
  • , Updated On : December 10, 2024 / 06:00 AM IST

    Buy Car

    Follow us on

    Buy Car: ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం వేగంగా పెరుగుతుంది. తక్కువ ఇంధన నిర్వహణ ఖర్చుల కారణంగా కొంతమంది వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కూడా రాయితీలను అందజేస్తున్నాయి. వాటి వినియోగం ఒకవైపు పర్యావరణానికి మేలు చేస్తుండగా, పెట్రోలియం ఉత్పత్తులు/దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు, ఎలక్ట్రిక్ వాహనం లేదా పెట్రోల్ వాహనం లేదా డీజిల్ వాహనాల్లో ఏది కొనుగోలు చేయడం లాభదాయకమని వినియోగదారులు ముందుగా తెలుసుకోవాలి.

    వాహనం ధర
    పెట్రోల్ కారుతో పోలిస్తే, ఎలక్ట్రిక్ వాహనం ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల సామాన్య వినియోగదారులు కొనడం కష్టమే అని చెప్పవచ్చు. ఉదాహరణకు, Tata Nexon పెట్రోల్ వెర్షన్ (బేసిక్ మోడల్) ఆన్-రోడ్ ధర రూ. 9.55 లక్షలు, అదే Tata Nexon EV ప్రైమ్ బేసిక్ మోడల్ ధర రూ. 14.50 లక్షలు. ధరలో ఇంత వ్యత్యాసం సాధారణ వినియోగదారులపై ఆర్థిక భారం కాబట్టి, తక్కువ ధరకు లభించే పెట్రోల్ వెర్షన్‌ను కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంతేకాకుండా, కారులో తక్కువ దూరం ప్రయాణించే వినియోగదారులకు పెట్రోల్ కార్లు మంచివని కొన్ని వర్గాలు నమ్ముతున్నాయి. దీని వలన అధిక ఇంధన ఖర్చులు ఉండవు. అయితే తక్కువ ధరలకు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు కార్ల కంపెనీలు నిరంతరం ప్రయత్నాలు చేస్తుండటంతో రానున్న కాలంలో ఇలాంటి కార్ల అమ్మకాలు కూడా ఊపందుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఖర్చు
    పెట్రోల్ ఖరీదైన ఇంధనం, ఇది వినియోగదారులకు ఇంధన ఛార్జీల రూపంలో భారంగా మారుతుంది. ఉదాహరణకు హైదరాబాద్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ. 107. టాటా నెక్సాన్ పెట్రోల్ మైలేజ్ నగరంలో సగటున 14 కి.మీ ప్రయాణిస్తుందని అనుకుంటే, రోజుకు కారులో 50 కి.మీ ప్రయాణించే వ్యక్తి ఇంధనంపై రూ.382. ఈ లెక్కన ఇంధన ధర దాదాపు సంవత్సరానికి రూ. 1.40 లక్షలు అవుతుంది. పెట్రోల్ వాహనంతో పోలిస్తే, ఎలక్ట్రిక్ వాహనం ఇంధన ధర చాలా తక్కువ. నెక్సాన్ ఈవీ పూర్తి ఛార్జింగ్‌కు 450 కి.మీ ప్రయాణిస్తుంది. ఒక్కో ఛార్జీకి దాదాపు 30 యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుంది. ఒక యూనిట్‌ ఖరీదు రూ.7 గా అనుకుంటే ఒక కి.మీకు 50 పైసలు ఖర్చవుతుంది. రోజుకు 50 కి.మీ ప్రయాణించేవారికి రూ.25 వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన సంవత్సరానికి ఇంధన ఖర్చు దాదాపు రూ.9,000 వరకు అవుతుంది. రోజుకు ఎక్కువ కి.మీ ప్రయాణించే వారికి పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంధన ధర కారణంగా చాలా ఆదా అవుతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ కార్లలో ఆటోమేటిక్ సౌకర్యాలు ఉండటం వల్ల డ్రైవింగ్ సులభం, సౌకర్యవంతంగా ఉంటుంది. 2040 నాటికి కొత్త కార్ల అమ్మకాల్లో 64శాతం వరకు ఎలక్ట్రిక్ కార్ల వాటా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    అలాగే టాటా నెక్సాన్ డీజిల్ ప్రారంభ ధర రూ. 9లక్షలతో మొదలు అవుతుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ. 98. టాటా నెక్సాన్ పెట్రోల్ మైలేజ్ నగరంలో సగటున 14 కి.మీ ప్రయాణిస్తుందని అనుకుంటే, రోజుకు కారులో 50 కి.మీ ప్రయాణించే వ్యక్తి ఇంధనంపై రూ.350 అవుతుంది. ఈ లెక్కన ఇంధన ధర దాదాపు సంవత్సరానికి రూ. 1.28 లక్షలు అవుతుంది. ఇలా రెండింటిని పోల్చుకుంటే ఈవీ కారు ధర ఎక్కువైనా ఇంధన ఖర్చులను భారీగా తగ్గిస్తుంది. మూడింటిని పరిశీలించి ఏది బెస్ట్ కారులో మీరే సెలక్ట్ చేసుకోవచ్చు.