Bollapally Srikanth
Bollapally Srikanth: జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. పూల పాన్పు అంతకన్నా కాదు. అంబానీ నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరి జీవితం ఇలానే ఉంటుంది. కష్టపడితే తప్ప విజయం సాధ్యం కాదు. ఇబ్బంది పడితే తప్ప గెలుపు తలుపు తట్టదు. అందుకే కష్టేఫలి అంటారు. అలా చేసే ఈ యువకుడు విజయం సాధించాడు. పూలు అమ్మిన చోటే.. పూల తోటలకు యజమాని అయ్యాడు..
అతని పేరు బొల్లాపల్లి శ్రీకాంత్.. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా లో పుట్టాడు. శ్రీకాంత్ తండ్రి సంప్రదాయ వ్యవసాయ కుటుంబం. అయితే సాగులో నష్టాలు రావడంతో వారి ఆర్థిక పరిస్థితి అంతకంతకు దిగజారిపోయింది. దీంతో శ్రీకాంత్ బాల్యం మొత్తం పేదరికంలోనే సాగిపోయింది దీంతో పది వరకే అతడు చదువుకోవాలని వచ్చింది. అతడి 16 వ ఏట బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లాడు. అక్కడ తన బంధువు వద్ద ఓ పూల దుకాణంలో పనిచేయడం మొదలు పెట్టాడు. అప్పట్లో నెలకు అతడికి 1000 రూపాయల దాకా వేతనం వచ్చేది. ఇంట్లో కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో.. ఆదాయం తక్కువ వచ్చినప్పటికీ శ్రీకాంత్ అవిశ్రాంతంగా పనిచేశాడు. ఇదే సమయంలో పూల పెంపకం గురించి తెలుసుకున్నాడు. మార్కెటింగ్ మెలకువలు నేర్చుకున్నాడు. ఇక ఇదే క్రమంలో 1997లో శ్రీకాంత్ ధైర్యంగా.. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చి బెంగళూరులో పూల దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అలా 2007 వరకు దాన్ని విజయవంతంగా నడిపాడు. దండిగా లాభాలు గడించాడు. అయితే అక్కడితోనే అతడు ఆగిపోలేదు. మరింత రిస్క్ తీసుకొని.. దుకాణం నడపగా వచ్చిన లాభాలను, తన పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి.. 10 ఎకరాల భూమిలో పూల పెంపకాన్ని ప్రారంభించాడు. కాలం గడుస్తున్న కొద్ది అతడికి లాభాలు రావడం.. పూల వ్యాపారం విస్తరించడంతో.. తన పూల తోటలను 52 ఎకరాలకు విస్తరించాడు.. ప్రస్తుతం శ్రీకాంత్ గులాబీలు, చామంతి, కనకాంబరాలు, లిల్లీ, జాస్మిన్, జెర్బరా, కార్నేషన్, జిప్సోఫీలా వంటి పూలను సాగు చేస్తున్నాడు.. ఈ పూలను మొత్తం బెంగళూరులోని దొడ్డబల్లాపూర్ సమీపంలోని గ్రీన్ హౌస్, పాలీ హౌస్ లలో సాగు చేస్తున్నాడు. అయితే ఈ మొక్కలను మొత్తం పూర్తిగా సేంద్రియ విధానంలోనే శ్రీకాంత్ సాగు చేస్తున్నాడు.
70 కోట్ల వ్యాపారం..
శ్రీకాంత్ తన ప్రస్థానాన్ని వెయ్యి రూపాయలతో మొదలుపెట్టాడు. నేడు 70 కోట్లకు పైచిలుకు వ్యాపారాన్ని చేస్తున్నాడు.. పేదరికం.. ఎదురైన కష్టాలు.. అనుభవించిన బాధలు.. పడిన దుఃఖం.. ఇవన్నీ కూడా శ్రీకాంత్ లో కసిని పెంచాయి. ఎదగాలనే కోరికను అతడిలో కలిగించాయి. అందువల్లే అతడు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. తన అభిరుచికి రంగులు అద్దాడు. తన మీద తనే ప్రయోగాలు చేసుకున్నాడు. అందువల్లే ఒకరి వద్ద పనిచేసిన అతడు.. నేడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కృషి, దృఢ సంకల్పం ముందు ఏదైనా దిగదుడిపే అని నిరూపించాడు. అందువల్లే ఫ్లవర్ మాన్ ఆఫ్ బెంగళూరుగా కీర్తి ప్రతిష్టలు అందుకుంటున్నాడు. శ్రీకాంత్ స్వస్థలం నిజామాబాద్ కావడంతో.. అక్కడ కూడా కొంతమేర భూమిని కొనుగోలు చేసి పూల తోటలు సాగు చేయాలని భావిస్తున్నాడు. ఇక్కడి నేలలకు అనుకూలమైన రకాలు సాగుచేసి.. ఆ పూలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలని యోచిస్తున్నాడు.