Mohan Babu: మంచు మోహన్ బాబు( manchu Mohan Babu) టిడిపిలో చేరుతారా? ఆ మేరకు సంకేతాలు ఇచ్చారా? విద్యాసంస్థల్లో చంద్రబాబు ఫ్లెక్సీల ఏర్పాటు వెనుక ఉద్దేశం అదేనా? లోకేష్ ఫ్లెక్సీలను సైతం ఎందుకు ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. మంచు మోహన్ బాబు సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా రాణించారు. తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆ కుటుంబం వివాదాల్లో చిక్కుకుంది. మోహన్ బాబు సైతం తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. కుటుంబాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అదే సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. పూర్వాశ్రమంగా భావించి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
* ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలు
నందమూరి తారక రామారావుకు( Nandamuri Taraka Rama Rao ) అత్యంత విధేయుడుగా వ్యవహరించారు మోహన్ బాబు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ వెంట అడుగులు వేశారు. చంద్రబాబుతో సైతం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే టిడిపిలో సంక్షోభ సమయంలో ఆయన లక్ష్మీపార్వతి వెంట ఉండిపోయారు. అక్కడకు కొద్ది కాలానికి తిరిగి చంద్రబాబు వద్దకు వెళ్ళిపోయారు. 1995 నుంచి 2001 వరకు టిడిపి తరఫున రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉండేవారు. అయితే చంద్రబాబుతో తలెత్తిన విభేదాలతో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ తో బంధుత్వం ఉండడంతో వైసీపీ వైపు మొగ్గు చూపారు.
* వైసీపీకి మద్దతు
2019 ఎన్నికలకు ముందు వైసీపీ( YSR Congress) గూటికి చేరారు మోహన్ బాబు. ఆ సమయంలో టిడిపి ప్రభుత్వంతో పాటు అప్పటి సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో బకాయిలు విడుదల చేయాలని కోరుతూ.. తిరుపతిలో ఏకంగా ఆందోళన బాట పట్టారు. విద్యార్థులతో కలిసి రహదారిపై నిరసన తెలిపారు. అప్పట్లో టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత రావడానికి అదొక కారణమైంది. అంతటితో ఆగకుండా వైసీపీకి మద్దతుగా ఆ ఎన్నికల్లో ప్రచారం చేశారు. చివరకు లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో సైతం మోహన్ బాబు ప్రచారం చేశారు. లోకేష్ కు వ్యతిరేకంగా.. వైసీపీకి అనుకూలంగా క్యాంపెయిన్ చేశారు. జగన్ అధికారంలోకి రావడంతో తనకు సముచిత స్థానం దక్కుతుందని భావించారు. కీలక పదవి వస్తుందని కూడా అంచనా వేసుకున్నారు. కానీ జగన్ మాత్రం మొండి చేయి చూపారు.
* ఎన్నికలకు ముందు చంద్రబాబుతో
ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో( Chandrababu) చర్చలు జరిపారు. దీంతో మోహన్ బాబు టిడిపిలోకి ఎంట్రీ ఖాయమని ప్రచారం నడిచింది. అయితే అటువంటిదేమీ లేకుండా పోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే ఇటీవల కుటుంబ విభేదాలు బయటపడ్డాయి. కుటుంబంతో చిన్న కుమారుడు మనోజ్ విభేదించారు. ఇటీవల ఆయన నారావారి పల్లె వెళ్లి మంత్రి లోకేష్ తో భేటీ అయ్యారు. ఇంకోవైపు మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణాల్లో చంద్రబాబు తో పాటు లోకేష్ ఫ్లెక్సీలు భారీగా వెలిసాయి. దీంతో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. ఒకవైపు మనోజ్ వేగంగా పావులు కదుపుతుండడం.. ఇంకోవైపు మోహన్ బాబు సైతం టిడిపిలో చేరేందుకు మొగ్గు చూపుతుండడం ఆసక్తికరంగా మారింది.