Bank Charges : నేటి కాలంలో బ్యాంకింగ్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉంది. డెబిట్ కార్డు కూడా ఉంటుంది. ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ కూడా చాలా సాధారణమైపోయాయి. బ్యాంకులో డబ్బు పెట్టడం పూర్తిగా లాభదాయకమని మనం అనుకుంటాం. కానీ, బ్యాంకు అనేక రకాల చిన్నచిన్న ఛార్జీల పేరుతో మీ జేబు నుంచి డబ్బులను కట్ చేస్తూ ఉంటుంది.. కొద్దికొద్దిగా అనిపించినా అన్నీ లెక్కలు వేసుకుంటే భారీగానే డబ్బులను దండుకుంటున్నాయి బ్యాంకులు.. అవి ఎలాగో చూద్దాం.
ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫీజు
మీరు పదే పదే ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నట్లయితే ఈ అలవాటు మీకు కాస్త ఖరీదు కావచ్చు. మెట్రో నగరాల్లో నెలకు 3 సార్లు, నాన్-మెట్రో నగరాల్లో 5 సార్ల వరకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటే ఉచితం. కానీ, ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ.20+GST వరకు ఛార్జ్ పడుతుంది. మీరు లిమిట్ దాటితే మీ సొంత బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బు తీసినా ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి, అవసరం లేనప్పుడు పదేపదే ఏటీఎం నుంచి డబ్బు తీయకండి. మొబైల్ వాలెట్ లేదా డిజిటల్ చెల్లింపులను ఉపయోగించండి.
మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే జరిమానా
ప్రతి బ్యాంక్ తమ ఖాతాదారులు తమ ఖాతాలో ఒక నిర్దిష్ట కనీస మొత్తాన్ని (మినిమమ్ బ్యాలెన్స్) ఉంచాలని సూచిస్తుంది. ఈ మొత్తం రూ.500 నుంచి రూ.10,000 వరకు ఉండవచ్చు. మీ బ్యాలెన్స్ దీనికంటే తక్కువైతే, బ్యాంక్ ప్రతి నెలా రూ.100 నుంచి రూ.600 వరకు జరిమానా వసూలు చేయవచ్చు. ఈ జరిమానా నుండి తప్పించుకోవడానికి, మీ ఖాతాలో ఎల్లప్పుడూ మినిమమ్ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం జీరో బ్యాలెన్స్ ఖాతాను తీసుకోవడం మంచింది.
Read Also: ఇడ్లీ దక్షిణ భారతదేశానికి చెందినది కాదు. దాని చరిత్ర మీకు తెలుసా?
డెబిట్ కార్డు యాన్వల్ ఛార్జ్
మీరు ఖాతా ఓపెన్ చేసేటప్పుడు మీకు డెబిట్ కార్డు వస్తుంది. దీని కోసం ప్రతి సంవత్సరం రూ.100 నుంచి రూ.500 వరకు ఛార్జ్ తీసుకుంటారు. కార్డు పోగొట్టుకుంటే, కొత్తది తెప్పించుకోవడానికి కూడా అదనపు ఛార్జ్ చెల్లించాలి. కాబట్టి, డెబిట్ కార్డును జాగ్రత్తగా ఉపయోగించండి. సమయానికి కార్డును రెన్యూవల్ చేయించుకోండి.
ఎస్ఎంఎస్ అలర్ట్ ఫీజు
మీరు చేసే ప్రతి లావాదేవీ గురించి బ్యాంక్ మీకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపుతుంది. దీని కోసం కొన్ని బ్యాంకులు సంవత్సరానికి రూ.15 నుండి రూ.100 వరకు ఎస్ఎంఎస్ ఛార్జ్ తీసుకుంటాయి. కొన్ని బ్యాంకులు ఈ సేవను ఉచితంగా కూడా అందిస్తాయి. ఈ ఛార్జీల నుండి తప్పించుకోవడానికి, మీరు మొబైల్ యాప్‌లో నోటిఫికేషన్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. ఎస్ఎంఎస్ సర్వీస్ అవసరం లేకపోతే దాన్ని స్టాప్ చేసేయండి.
చెక్ బౌన్స్ ఛార్జ్
మీరు ఎవరికైనా చెక్ ఇచ్చి, ఖాతాలో తగినంత డబ్బు లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. దీని కోసం బ్యాంక్ రూ.300 నుంచి రూ.700 వరకు ఛార్జ్ చేస్తుంది. ఇది చట్టపరంగా నేరం కూడా. కాబట్టి, చెక్ ఇచ్చే ముందు మీ ఖాతాలో డబ్బు ఉందని ఎల్లప్పుడూ నిర్ధారించుకోండి.
Read Also: సుకుమార్ ఆ యంగ్ హీరోతో ఆర్య 3 సినిమా చేస్తున్నాడా..?
నగదు డిపాజిట్ , విత్డ్రాల్ ఛార్జ్
కొన్ని బ్యాంకులు నెలకు పరిమిత సంఖ్యలో మాత్రమే ఉచితంగా నగదు జమ చేయడానికి లేదా విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తాయి. మీరు లిమిట్ కు మించి నగదు జమ చేస్తే లేదా తీస్తే, ప్రతి లావాదేవీకి రూ.150 వరకు ఛార్జ్ చేయవచ్చు. కాబట్టి, ఎక్కువ సార్లు బ్రాంచ్‌కు వెళ్ళకుండా, డిజిటల్ ట్రాన్షాక్షన్లను ఉపయోగించండి.
ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఛార్జీలు (NEFT, RTGS, IMPS)
NEFT, RTGS , IMPS వంటి లావాదేవీలపై కూడా కొన్ని బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. అయితే, ఇప్పుడు అనేక ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ సేవను ఉచితంగా అందిస్తున్నాయి. అయినప్పటికీ, కొన్ని బ్యాంకులు పాత నిబంధనల ప్రకారం ఛార్జీలను వసూలు చేస్తాయి. కాబట్టి, మీరు మొబైల్ యాప్ ద్వారా లావాదేవీలు చేయండి. ఈ సర్వీసును ఉచితంగా అందించే బ్యాంక్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
బ్యాంకులు వసూలు చేసే ఈ ఛార్జీల గురించి తెలుసుకోవడం, వాటి నుండి తప్పించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మీరు మీ డబ్బును ఆదా చేసుకోవచ్చు.