Ather : భారతదేశపు ప్రముఖ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది ఏథర్. ఈ ఏథర్ ఎనర్జీ షేర్లు మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో 2.2శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. రూ.2,980 కోట్ల ఐపీవో తర్వాత ఈ స్టాక్ ఎన్ఎస్ఈలో రూ.328 వద్ద, బీఎస్ ఈలో రూ.326 (1.6శాతం ప్రీమియం) వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇష్యూ ధర రూ.321తో పోలిస్తే ఇది స్వల్ప లాభంతో మొదలైంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుండి సానుకూల స్పందన అంతంతమాత్రంగానే ఉండడంతో ఈ ఐపీఓ కేవలం 1x కంటే కొంచెం ఎక్కువ సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. ఈ లిమిటెడ్ స్పందనకు అనుగుణంగా స్టాక్ లిస్టింగ్ ముందు గ్రే మార్కెట్ ప్రీమియం(GMP) దాదాపు 3శాతం వద్ద ఉంది.
ఈ ఐపీఓలో రూ.2,626 కోట్ల విలువైన కొత్త షేర్ల జారీ, రూ.354కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.304-రూ.321గా నిర్ణయించారు. ఎగువ ధర వద్ద, ఈ ఇష్యూ సుమారు రూ.12,300 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సూచిస్తోంది. ఏథర్ తన మహారాష్ట్రలోని కొత్త ఫ్యాక్టరీకి నిధులు సమకూర్చడానికి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి, మార్కెటింగ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఈ ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను ఉపయోగించనుంది.
Also Read : పెట్రోల్‌కు చెక్ పెట్టేయండి.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లతో భారీగా ఆదా చేయండి
2013లో ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థులు తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ ఏథర్ ఎనర్జీ కంపెనీ స్థాపించారు. ప్రస్తుతం దాని ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో ఏథర్ 450, కొత్తగా విడుదల చేసిన ఏథర్ రిజ్తా ఉన్నాయి. ఈ రెండూ టెక్-ఫార్వర్డ్, పర్ఫామెన్స్ బేస్డ్ స్కూటర్లుగా స్థానం పొందాయి. ఈ సంస్థ భారతదేశంలో అతిపెద్ద టూ-వీలర్ ఫాస్ట్-చార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా నిర్వహిస్తోంది. ఇది 300 కంటే ఎక్కువ నగరాల్లో 2,600 కంటే ఎక్కువ చార్జర్‌లను కలిగి ఉంది.
ఏథర్ యూనిట్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో లక్ష మార్కును దాటాయి. ఇది భారతదేశంలోని టాప్ నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారులలో ఒకటిగా నిలిచింది. ఛత్రపతి శంభాజీనగర్‌లో ఫ్యాక్టరీ 3.0 అభివృద్ధి చెందుతున్నందున ఉత్పత్తిని రెట్టింపు చేయాలని యోచిస్తోంది. ఇది పూర్తయిన తర్వాత దాని మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.4 మిలియన్ యూనిట్లకు చేరుకోనుంది.