Toyota Innova Ethanol: వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో వాతావరణ కాలుష్యం అవుతోంది. దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల కారణంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పెట్రో ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించడం తో పాటు తక్కువ ధరకే ఫ్యూయల్ అందించేలా వాహనాలు తయారు చేయాలని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించింది. ఇందులో భాగంగా తాజాగా ప్రపంచంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారును రిలీజ్ చేశారు. మొక్కలతో తయారు చేసిన బయో ఫ్యూయెల్ ద్వారా ఈ కారు నడుస్తుంది. దీనిని కేంద్ర రవాణా శాఖ మంత్రి బుధవారం ఆవిష్కరించారు. ఈ కారు వివరాల్లోకి వెళితే.
టయోటా నుంచి ఇన్నోవా కారు సక్సెస్ అయిన విషయం తెలిసిందే. దీనినే కొత్త వెర్షన్ లో తయారు చేశారు. దీనిని కిర్లోస్కర్ మోటార్స్ అభివృద్ధి చేసింది. కానీ దీనికి BS6 స్టేజ్ 2 అని పేరు పెట్టారు. ఇది పూర్తిగా Flex Fuel Vehicle. ఇది ఇథనాల్ అనే బయో ఫ్యూయెల్ తో నడుస్తుంది. బయో ఫ్యూయెల్ ను మొక్కలతో తయారు చేస్తారు. దీని వల్ల పర్యావరణానికి ఎటువంటి ముప్పు ఉండదు. అంతేకాకుండా ఇది విద్యుత్ ఆధారిత మరియు బయో ఫ్యూయెల్ ఆధారంగా నడుస్తుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి కారును ఎవరూ తయారు చేయలేదు. దీంతో భారత్ ఈ ఘనత సాధించింది.
గతంలో రోడ్డు, రవాణా శాఖ మంత్రి హైడ్రోజన్ తో పాటు విద్యుత్ తో నడిచే ‘ఇరాయ్ ఈవీ’ అనే కారును ఆవిష్కరించారు. ఇప్పుడు పూర్తిగా ఇథనాల్ కారును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్ల వల్ల గాలిలో కాలుష్యం తగ్గడంతో పాటు ముడి చమురు బాధ నుంచి కూడా పూర్తిగా ఉపశమనం పొందవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2025 మార్చి నాటికి పెట్రోల్ లో 25 శాతం ఇథనాల్ కలపాలని ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే తాజాగా Flex Fuel Vehicleను ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో లక్ష్యాన్ని ఛేదించడంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పొచ్చు.
పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఇలాంటి కార్లు మార్కెట్లోకి రావడం శుభ పరిణామం అని కొందరు అంటున్నారు. భవిష్యత్ లో అనుకున్న లక్ష్యాన్ని చేరితే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంతో పాటు తక్కువ ధరకే కార్లలో తిరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.