Anand Mahindra RBI: మార్కెట్లో రుణాల లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో.. అవసరమైన వారికి రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ టెక్ ప్లాట్ ఫారమ్ ఫర్ ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్(పీటీపీఎఫ్సీ) ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు మీటింగ్లో ప్రదర్శించింది. ఈ ప్రక్రియ రుణాల మంజూరును వేగవంతం చేస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. తయారీ రంగం, సేవల రంగం బలోపేతం అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. అయితే ఈ విధానాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సమర్ధించారు. బోర్డ్ ఆఫ్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాన్ని ఆయన బాగుందని కితాబిచ్చారు. రుణ గ్రహీతలు, రుణ సంస్థలను అనుసంధానించి, తక్కువ మొత్తంలో తీసుకోవాలనుకునే వారికి తీసుకురావడం లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్నోవేషన్ హబ్ ఈ పీటీపీఎఫ్సీ ని రూపొందించింది. ఈ ప్లాట్ ఫామ్ రూ. 1.6 వరకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు, ఎంఎస్ఎంఈ లకు నాన్_ కొలేటరల్ ఆధారిత రుణాలు, హోమ్ లోన్లు, డెయిరీ లోన్లు, వ్యక్తిగత రుణాల మంజూరులో సహాయపడుతుంది.
దీనికి సంబంధించి జరిగిన ఆర్బిఐ బోర్డు సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పాల్గొన్నారు. ఆ విషయాన్ని ట్విట్టర్ ఎక్స్ లో పంచుకున్నారు. “కొన్నిసార్లు ముందు వరుసలో సీటు దక్కించుకోవడం మహా గొప్పగా ఉంటుంది. ఇండోర్ లో జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశంలో పాల్గొన్న మాకు పీటీపీఎఫ్సీ ప్రాజెక్టును ప్రదర్శించారు. ఇది కేవైసీ ప్రక్రియలు, డాక్యుమెంట్లను సమీకృతం చేయడం ద్వారా రుణం మంజూరు చేయడానికి పట్టే సమయాన్ని రోజుల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. దీని ద్వారా గ్రామీణ ఖాతాదారులకు క్రెడిట్ డెలివరీ మెకానిజంలో విప్లవాత్మక మార్పులను కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ఓపెన్ ప్లాట్ ఫామ్. దీనిని ఉపయోగించుకోవాలనుకునే అన్ని బ్యాంకులకూ అందుబాటులో ఉంటుంది. భారత్ డిజిటల్ పోల్ పొజిషన్ ను మరింత వేగంగా తీసుకుంటోంది. దీనివల్ల మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అభినందనలు” అంటూ ఆనంద్ మహీంద్రా రాస్కొచ్చారు. పీటీపీఎఫ్సీ పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను కూడా జత చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన విధానం స్వల్పకాలిక వ్యాపారాలు చేసే వారికి, రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోవిడ్ తర్వాత రుణాల లభ్యత తగ్గిపోవడంతో మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో చాలావరకు ఉద్యోగాలు పోయాయి. ఉపాధి లేక చాలామంది నగరాల నుంచి ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆర్థిక రంగం గాడిలో పడుతున్న నేపథ్యంలో తయారీ రంగం, సేవల రంగం, వస్తు ఉత్పత్తి రంగానికి చేయూతనిచ్చే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విధానం పూర్తిస్థాయిలోకి అమలులోకి వస్తే పలు రంగాలు తిరిగి గాడిలో పడడం ఖాయమని వ్యాపారవేత్తలు చెబుతున్నారు.