Anand Mahindra Praises Retired IPS Officer: రోడ్డుమీద వెళ్తుంటాం.. కూల్ డ్రింక్ తాగి బాటిల్ అలా పడేస్తుంటాం. బైక్ మీద వెళ్తూ అప్పటిదాకా తిన్న మొక్కజొన్నలు తిని బెండు అలా విసిరేస్తుంటాం. అక్కడ దాకా ఎందుకు ఇంట్లో పోగు పడిన చెత్తను.. ఒక కవర్లో కట్టి వీధుల్లో వేస్తుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే మనలో డర్టీ నెస్ కు కొలమానాలు వేరే విధంగా ఉంటాయి. ఈ జాబితాలో చదువుకున్నవాళ్లే ఎక్కువగా ఉంటారు. పైగా దేశం మొత్తం పాడైపోతుందని.. చెత్త ఎక్కువైతోందని.. పర్యావరణం సర్వనాశనం అయిపోతుందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటారు. పోస్టులు చేస్తుంటారు. కనీసం ఏడాదికి ఒకటైన మొక్క కూడా నాటరు. నాటిన మొక్కను సంరక్షించరు. ఇలాంటి వాళ్లకు ఈ వృద్ధుడు చేస్తున్న పని కనువిప్పు.
Also Read: చివరి చిత్రంపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..
అతని పేరు ఇంద్రజిత్ సింగ్. ఉండేది చండీగడ్ లో. వయసు 88 సంవత్సరాలు. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ గా పని చేశారు. ఇది నిర్వహణలో అత్యంత నిక్కచ్చిగా ఉన్నారు. అందువల్లే ఆయనకు డైనమిక్ ఆఫీసర్ అనే పేరు వచ్చింది. పైగా తన సర్వీసులో ఒకరి దగ్గర చేయి చాచలేదు. అన్యాయంగా ఏ పనీ చేయలేదు. అక్రమార్కులకు వంత పాడలేదు. స్థూలంగా చెప్పాలంటే భారతీయుడు టైపు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత.. విశ్రాంత జీవితం హాయిగా గడపాల్సింది పోయి.. ఆయన పూర్తి సమయాన్ని సమాజ సేవకు అంకితం చేశారు.. అలాగని తానేదో గాంధీ మహాత్ముడునని.. సర్వ పరిత్యాగినని చెప్పుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇంకొకరిని సహాయం చేయమని అడగడం లేదు. మరొకరిని తనలా ఉండమని కోరడం లేదు. ఈ భూమ్మీద పుట్టిన మనిషిగా.. ఈ భూమి మీద మమకారం ఉన్న వ్యక్తిగా తన వంతుగా ఈ పుడమికి పనిచేసుకుంటూ వెళ్తున్నారు.
చండీగడ్ పెద్దనగరం. పైగా అది పంజాబ్, హర్యాన రాష్ట్రాలకు సంయుక్త రాజధాని. ఇక్కడ జనాభా ఎక్కువగా ఉంటుంది. అదే స్థాయిలో చెత్త కూడా పోగుపడుతూ ఉంటుంది. పురపాలక సిబ్బంది నిత్యం శుభ్రం చేస్తూనే ఉన్నప్పటికీ మనుషుల్లో డర్టీనెస్ పెరగడం వల్ల చెత్త ఎక్కడపడితే అక్కడే ఉంటుంది. దీంతో ఆ నగరం కాస్త మురికి కూపన్ లాగా దర్శనమిస్తుంటుంది. అయితే ఇది తనకు తలవంపులాగా ఇంద్రజిత్ సింగ్ భావించాడు. మరొక మాటకు తావు లేకుండా ఒక రిక్షాను సమకూర్చుకున్నాడు. 88 సంవత్సరాల వయసులోనూ ఉదయం 6 గంటలకు చండీగఢ్ నగర వీధిలో తిరుగుతూ చెత్తను సేకరిస్తుంటాడు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలిస్తుంటాడు. తన నగరం శుభ్రంగా ఉండాలనేది ఈయన ఆలోచన. అందువల్లే ఈ వయసులో కూడా చెత్తను సేకరిస్తున్నాడు. సేకరించిన చెత్తను తడి, పొడి విభాగాలుగా మార్చి డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నాడు.
“స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో నా నగరాన్ని మొదటి స్థానంలో ఉంచడమే నా ముందున్న లక్ష్యం. అందువల్లే ఇదంతా చేస్తున్నాను. నాకు ఎటువంటి గుర్తింపు అవసరం లేదు. ఇంకొకరి సహకారం అవసరం లేదు. జస్ట్ ఎవరి చెత్తను వారు డస్ట్ బిన్ లో వేస్తే సరిపోతుంది. అడ్డగోలుగా రోడ్లమీద చెత్త వేస్తే నగరం మొత్తం కంపుగా మారిపోతుంది. తద్వారా దోమలు, ఈగలు వృద్ది చెంది రోగాలు వ్యాపిస్తుంటాయి. ఇది ఈ నగరానికి మంచిది కాదు. ఈ నగరంలో ఉండే ప్రజలకు ఏమాత్రం మంచిది కాదు. సాధ్యమైనంతవరకు శుభ్రత పాటించడమే మనుషులుగా మన బాధ్యత అంటూ” చెబుతున్నారు ఇంద్రజిత్ సింగ్. ఇతను చేస్తున్న స్వచ్ఛ సేవ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టికి కూడా వచ్చింది. దీంతో ఆయన ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఇటువంటి వ్యక్తులకు సెల్యూట్ చేయాల్సిందేనని పేర్కొన్నారు.”కొంతమంది ఈ భూమి మీద స్వార్థం లేకుండా బతుకుతుంటారు. అందులో ఈయన కూడా ఒకరు. ఆ జాబితాలో ప్రథమ స్థానంలో ఉంటారు. ఏ మాత్రం గుర్తింపు కోరుకోవడం లేదు. ఇటువంటి నిశ్శబ్ద యోధుడికి పాదాభివందనం తప్ప చేసేదేముండదని” ఆనంద్ మహీంద్రా తన ట్విట్ లో వ్యాఖ్యానించారు.