E-Commerce Reviews : ఒక వస్తువు కొనుగోలు విషయంలో వినియోగదారుడికి అత్యంత విలువైనది రివ్యూనే. ఆ వస్తువు ఎలా పని చేస్తుంది?, నాణ్యత ఎలా ఉంది?, సదరు వస్తువుకు అంత డబ్బును చెల్లించవచ్చా? అనే విషయాలను కేవలం రివ్యూస్ మాత్రమే చెప్తాయి. అయితే, ఈ రివ్యూలు పారదర్శకంగా ఉండడం లేదు. కారణం, సదరు వస్తువుకు సంబంధించిన కంపెనీలు నకిలీ రివ్యూలు ఇస్తూ బిజినెస్ పెంచుకుంటున్నాయి. దీంతో వినియోగదారులు ఈ-కామర్స్ కంపెనీలను నిలదీస్తున్నారు. దీంతో రివ్యూల విషయంలో మరింత పకడ్బంధీగా ఉండాలని కొన్ని రూల్స్ ను తీసుకువచ్చారు.
నకిలీ (ఫాల్స్) రివ్యూల సమస్యను పరిష్కరించడంపై చర్చించేందుకు వినియోగదారుల వ్యవహారాల విభాగం ప్రధాన ఈ-కామర్స్ కంపెనీలతో సమావేశం నిర్వహించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, గూగుల్, మెటా తదితర సంస్థల ప్రతినిధులు ‘ఆన్ లైన్ కన్జ్యూమర్ రివ్యూస్’పై ఐఎస్ 19000:2022 ప్రమాణాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదించిన క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ కు ఆమోదం తెలిపారు.
నకిలీ రివ్యూలను గణనీయంగా తగ్గించడంలో వ్యవస్థ విఫలమైందని భావించి ఈ చర్యలకు పూనుకున్నాయి. ఈ-కామర్స్ కు సంబంధించిన వినియోగదారుల ఫిర్యాదులు 2018లో 95,270గా ఉంటే అవి 2023 లో 4,44,034 కు పెరిగాయి. దీంతో నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం వచ్చింది.
క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ప్రస్తుతం IS 19000:2022 ప్రమాణాన్ని అమలు చేస్తుంది. ఇది రివ్యూ ఇచ్చేవారు, ప్లాట్ ఫారమ్ కు కొన్ని మార్గదర్శకాలను వివరిస్తుంది. పారదర్శకతను నిర్ధారించడంతో పాటు రివ్యూస్ ను తారు మారు చేయడంను అడ్డుకుంటుంది.
* సమీక్షకుల గుర్తింపు: సమీక్షకులకు (రివ్యూ రాసేవారి) అజ్ఞాతత్వం తొలగించబడుతుంది.
* ఎడిట్ చేయకుండా: ఒక వ్యక్తి రాసిన రివ్యూలోని కంటెంట్ తారుమారు కాకుండా చూస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత సమీక్షలను మార్చేందుకు అనుమతి ఇవ్వదు.
* అన్ని సమీక్షలను ప్రోత్సహించడం: ప్లాట్ ఫారమ్ పాజిటివ్, నెగెటివ్ అన్ని రివ్యూలను అనుమతిస్తుంది. నెగెటివ్ రివ్యూలను అడ్డుకోలేవు.
భారత వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే ఈ ప్రమాణాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు, ఆన్ లైన్ లో షాపింగ్ చేసే వినియోగదారులు రివ్యూలపై ఎక్కువగా ఆధారపడతారు. భౌతికంగా పరిశీలించలేని ఉత్పత్తుల కొనుగోలు విషయంలో ఫాల్స్ రివ్యూ వినియోగదారుడి నమ్మకాన్ని దెబ్బ తీస్తుంది. అదేవిధంగా నాణ్యతలేని వస్తువుల కొనుగోలుకు దారి తీస్తాయి. సమావేశానికి హాజరైన వినియోగదారుల కార్యకర్త పుష్ప గిరింజీ ఈ చొరవను స్వాగతించగా, ఫాల్స్ రివ్యూస్ సమస్యను ఎదుర్కోవాలంటే ఈ నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు.
ముసాయిదా క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ అమలుకు ముందు వినియోగదారులను సంప్రదిస్తారు. భారతీయ వినియోగదారులకు మరింత విశ్వసనీయమైన ఆన్ లైన్ షాపింగ్ అనుభవాన్ని నిర్ధారించే దిశగా ఒక మంచి అడుగు పడనుంది.