Adani Group: అదానీ చేతికి పెన్నా సిమెంట్స్, లైన్ లో మరిన్ని కంపెనీలు.. ఏకంగా బిర్లాకే స్కెచ్..

వ్యాపారంలో అదానీ మరింత దూకుడుగా వెళ్తున్నారు. ఇది బిర్లా ఆధీనంలో నడిచే సిమెంట్ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది..అదానీ పూర్తిస్థాయిలో సిమెంట్ వ్యాపారంపై దృష్టి సాధించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 14, 2024 8:49 am

Adani Group

Follow us on

Adani Group: భారతదేశ కుబేరుడు, ఆసియాలో అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ తన వ్యాపార జోరు కొనసాగిస్తున్నారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. మాలిక సదుపాయాల కల్పన పై దృష్టి సారిస్తామని చెప్పడంతో..అదానీ తన వ్యాపార ప్రణాళికను మరింత పకడ్బందీగా రూపొందించుకుంటున్నారు. ఇది దేశంలోని ఇతర వ్యాపారులను, ముఖ్యంగా బిర్లా కంపెనీలలో ఒత్తిడి పెంచుతోంది. ముఖేష్ అంబానీ జియో వల్ల బిర్లా కంపెనీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఆ కంపెనీ వోడాఫోన్ తో జత కట్టాల్సి వచ్చింది.. చాలామంది వినియోగదారులను కోల్పోవాల్సి వచ్చింది.. టెలికాం వ్యాపారం నష్టాల్లో ఉందని భావిస్తుంటే.. గోటి చుట్టూ రోకటి పోటు లాగా ఇప్పుడు సిమెంట్ వ్యాపారంలో అదానీ మరింత దూకుడుగా వెళ్తున్నారు. ఇది బిర్లా ఆధీనంలో నడిచే సిమెంట్ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది..అదానీ పూర్తిస్థాయిలో సిమెంట్ వ్యాపారంపై దృష్టి సాధించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే కీలక కంపెనీలను కొనుగోలు చేసిన అదానీ గ్రూప్.. తమ సిమెంట్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. తమకు అనువైన అనేక సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేసేందుకు అన్వేషిస్తోంది.

పెన్నా సిమెంట్స్ కొనుగోలు

సిమెంట్ పరిశ్రమలో ఆధిపత్యాన్ని సాగించేందుకు హైదరాబాద్ ఆధారంగా కార్యకలాపాలు సాగించే పెన్నా సిమెంట్స్, గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సౌరాష్ట్ర సిమెంట్స్, జై ప్రకాష్ అసోసియేట్స్, ఏబీజీ షిప్ యార్డ్ యాజమాన్యంలోని వడరాజ్ సిమెంట్ తయారీ కంపెనీలను కొనుగోలు చేయాలని అదానీ గ్రూప్ భావిస్తోంది. వీటి కోసం దాదాపు మూడు బిలియన్ డాలర్లు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం.. వచ్చే నాలుగు సంవత్సరాలలో సిమెంట్ వ్యాపారాన్ని అదానీ మరింత బలోపేతం చేస్తారని తెలుస్తోంది. ఇందులో భాగంగా మార్కెట్లో లీడర్ గా ఉన్న బిర్లా కంపెనీ (అల్ట్రాటెక్ )ను అధిగమిస్తారని సమాచారం.

దివాళా లో ఉన్నాయి

జై ప్రకాష్ అసోసియేట్స్, వడ రాజ్ సిమెంట్స్ ప్రస్తుతం దివాళాలో ఉన్నాయి. జై ప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీ, ICICI బ్యాంకు మధ్య వివాదం నడుస్తోంది. జై ప్రకాష్ అసోసియేట్స్ దాఖలు చేసిన పిటిషన్ పై నేషనల్ కంపెనీ అపిలేట్ ట్రిబ్యునల్ ఇటీవల ICICI బ్యాంకుకు నోటీసు జారీ చేసింది. వన్ టైం సెటిల్మెంట్ ప్రతిపాదనను జెపి సిమెంట్స్ ప్రతిపాదించిందని, జూన్ 24 లోగా దానిని లెక్కలోకి తీసుకోవాలని సూచించింది. జై ప్రకాష్ కంపెనీకి మొత్తంగా 26 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక అదానీ గ్రూపు ఇంతకుముందు సిమెంటు ఉత్పత్తి చేసే సంఘీ ఇండస్ట్రీస్ ను కొనుగోలు చేసింది.. ఈ కంపెనీ గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని అబ్దాసా తాలూకాలోని సంఘీపురంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ స్ట్రీమ్ సిమెంటు ఉత్పత్తి చేస్తుంది. లోగడ అదానీ గ్రూప్10.5 బిలియన్ డాలర్లు వెచ్చించి అంబుజా, ACC సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేసింది.

తెలుగు రాష్ట్రాల సిమెంట్ కంపెనీలలో అదానీ పాగా

పెన్నా సిమెంట్స్ కొనుగోలుకు ముందే అదానీ భారీ స్కెచ్ వేశారు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పేరుపొందిన మై హోమ్ గ్రూప్ మహా సిమెంట్స్ tuticorin plant ను ఈ సంవత్సరమే కొనుగోలు చేసింది, ఇప్పుడు ఏకంగా పెన్నా కంపెనీ మొత్తాన్ని కొనేసింది. మరికొన్ని కూడా ఒక సంవత్సర కాలంలోనే అదానీ చేతిలోకి వెళ్లడానికి లైన్లో ఉన్నాయ్. ఇప్పటికే దేశీయ సిమెంట్ రంగంలో ఒక శాతం వాటా కలిగి ఉన్న అదానీ వచ్చే రోజుల్లో ఇదే దూకుడును కొనసాగించి.. సిమెంట్ తయారీలో నెంబర్ వన్ గా ఆవిర్భవించాలని అదానీ భావిస్తున్నారు. అదానీ బిర్లా కి పెట్టిన టార్గెట్ లో ఇప్పుడు సమిధలు MyHome, పెన్నా సిమెంట్ మారాయి. ఇదే వేట కొనసాగిస్తే లాస్ లో ఉన్న మరికొన్ని తెలుగు కంపెనీలు అదానీ వశం కాకతప్పదు. అప్పుడు దేశ సిమెంట్ రంగంలో అదానీ తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. సిమెంట్ ధరల నియంత్రణలో పట్టు సాధించే అవకాశాలుంటాయి.