Car Selection : వాహన కొనుగోలుదారుల్లో మార్పు వస్తోంది. కొత్త కార్లు కొంటున్నా.. పాత కార్లు అమ్మేందుకు మాత్రం చాలా మంది ఆసక్తి చూపడం లేదు. కొత్త కారు కొన్నా.. పాత కారే సౌకర్యంగా ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలతో పెద్ద కార్లలో తిరగలేకపోతున్నామని పేర్కొంటున్నారు. సిటీలో చిన్నకార్లే బెటర్ అంటున్నారు. దూర ప్రాంతాలకు మాత్రమే పెద్దకార్లు ఉపయోగిస్తామని చెబుతున్నారు.
ఎవరి అవసరం వారిది..
నగరంలో వాహనదారులు కొత్తకారు కొంటున్నారంటే పాత కారును ముందే అమ్మకానికి పెడుతుంటారు. మరికొందరు ఎక్సే్ఛంజ్‌లో ఇచ్చేస్తుంటారు. కానీ, ఇప్పుడు వాహన కొనుగోలుదారుల్లో మార్పు వచ్చింది. దీంతో అమ్మడం, ఎక్స్ఛేంజ్ కాకుండా మూడో పద్ధతి అవలంబిస్తున్నారు. కొత్తకారు కొన్నా.. పాత కారు ఉండాల్సిందే అనేవారు పెరుగుతున్నారు. గతంలో పాత కారును సెంటిమెంట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకునేవారు. ఇప్పుడేమో పాతకారు అవసరంగా మారింది. దీంతో అమ్మేవారు తగ్గుతున్నారు.
బైక్‌లను భర్తీ చేస్తున్న కార్లు..
తెలంగాణలో 2021–22లో 1.52 లక్షల కార్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిలో అత్యధికం కొత్త కార్లే. పాత కార్లు కూడా ఇందులోకి వస్తాయి. ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. రాజధాని ప్రాంతంలోకి వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోనే లక్షకు పైగా వాహనాలు ఏటా రిజిస్టర్ అవుతున్నాయి. ద్విచక్రవాహనాలను క్రమంగా కార్లు భర్తీ చేస్తున్నాయి. రహదారులపై సోమవారం నుంచి శుక్రవారం వరకు విపరీతమైన రద్దీ ఉంటోంది. ముచ్చటపడి, లక్షలు పోసి పెద్ద కారు కొనుగోలు చేసినా.. నత్తనడకను తలపించే హైదరాబాద్ ట్రాఫిక్‌లో నడపలేక నరకయాతన పడుతున్నారు.
పార్కింగే పెద్ద సమస్య..
నగరంలో పెద్దకార్లకు పార్కింగ్ ప్రధాన సమస్యగా మారింది. వరుస క్రమశిక్షణ పాటించని హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఎక్కడ ఎవరొచ్చి తాకిస్తోరనని.. ఎక్కడ గీతలు పడతాయోనని భయపడుతున్నారు. ఇలాంటి అనుభవాలతో తమకు అలవాటైన పాత చిన్నకారులో సిటీలో చక్కర్లు కొడుతున్నారు. రోజువారీ కార్యాలయానికి ఒక్కడినే వెళ్లేందుకు పెద్ద కారు అవసరం లేదని చాలామంది అంటున్నారు. డ్రైవర్ ఉంటే సరే.. సొంతంగా డ్రైవ్ చేసేవాళ్లు మాత్రం సిటీ లోపలికి కారంటే ఒకటి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పండగపూట సొంత ఊర్లకు వెళ్లేందుకు, అవుటర్‌పై సిటీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేటప్పుడు, శివార్లలో జరిగే వేడుకలకు హాజరయ్యేందుకు మాత్రం పెద్ద బండిని తీస్తున్నామని చెబుతున్నారు.