Anant Ambani Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహం జూలై 12 (నేడు) జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి.. ముంబై మహానగరంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్ లో వివాహం జరిపించేందుకు ముఖేష్ అంబానీ కుటుంబం సర్వం సిద్ధం చేసింది. వీరిద్దరి వివాహానికి దేశంలోని ప్రముఖులతో పాటు విదేశాల్లో ఉన్న వ్యాపార దిగ్గజాలు హాజరవుతున్నారు. వివాహానికి వచ్చే వారికోసం ముఖేష్ అంబానీ కుటుంబం అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికోసం అంతకుమించి అనేలాగా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా వీవీవీఐపీ ల కోసం ముఖేష్ అంబానీ కుటుంబం ఏకంగా క్లబ్ వన్ ఎయిర్ సంస్థ నుంచి మూడు ఫాల్కన్ జెట్ లను, వంద విమానాలను కిరాయికి తీసుకుంది. పెళ్లికి వచ్చే అతిధులను విమానాలలో తీసుకురావడం, తర్వాత వారి గమ్యస్థానాలకు తిరిగి పంపిస్తారు. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. సౌదీ అరామ్ కో సీఈవో ఆమీన్ నాసర్, హెచ్ఎస్బీసీ గ్రూప్ చైర్మన్ మార్కెట్ టక్కర్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మోర్గాన్ స్టాన్లీ ఎండీ మైఖేల్ గ్రిమ్స్, సాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జే లీ, ముబదలా ఎండీ ఖల్దున్ అల్ ముబారక్, బ్రిటిష్ పెట్రోలియం సీఈవో ముర్రే వంటి వారు ఈ వివాహానికి హాజరవుతున్నారు.
అనంత్ – రాధిక వివాహం నేపథ్యంలో ముంబై మహానగరంలో సెవెన్ స్టార్, ఫైవ్ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే వాటి నిర్వాహకులు గదుల ధరలను అమాంతం పెంచారు.. ఏ ఒక్క హోటల్ గది కూడా ఖాళీగా లేదు. వాస్తవానికి జూలై సమయంలో ముంబైలో హోటళ్లకు అంతగా గిరాకీ ఉండదు. కానీ, జూలై నెలలో ఒక్క రూమ్ కూడా ఖాళీగా లేదంటే దానికి కారణం అనంత్ – రాధిక వివాహమేనని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. ముంబైలో పేరుపొందిన హోటళ్లల్లో ఒక్క రోజుకు 13,000 చార్జ్ చేస్తారు. అనంత్ వివాహం నేపథ్యంలో ఆ ఛార్జ్ ను ఏకంగా లక్ష రూపాయలకు పెంచారు.
ఇక జూలై 12న శుభ్ వివాహ్, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అనంత్ – రాధిక రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించుకున్నారు. మార్చిలో గుజరాత్ జామ్ నగర్ లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించిన ఈ జంట.. ఇటీవల విదేశాలలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేక క్రూయిజ్ లో ఇటలీ నుంచి ఫ్రాన్స్ దాకా 4,500 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇక ఇటీవల అనంత్ వివాహాన్ని పురస్కరించుకొని ముఖేష్ అంబానీ – నీతా అంబానీ తమ జియో వరల్డ్ సెంటర్లో 50 పేద కుటుంబాలకు చెందిన యువతీ యువకులకు వివాహాలు జరిపించారు. వారికి ఖరీదైన కానుకలు అందించారు. వివాహాల ఖర్చు మొత్తం రిలయన్స్ కంపెనీ భరించింది. నూతన జంటలకు అవసరమయ్యే ప్రతీ వస్తువును రిలయన్స్ కంపెనీ అందించింది. మార్చిలో జరిగిన మందస్తు వివాహ వేడుకల్లో అమెరికన్ పాప్ గాయని రియన్నా సందడి చేయగా.. ప్రస్తుత సంగీత్ వేడుకల్లో అమెరికన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తన పాటలతో ఆహూతులను అలరించాడు. జాతీయ మీడియా కథనాల ప్రకారం అనంత్ వివాహం కోసం ముఖేష్ అంబానీ కుటుంబం దాదాపు ₹1,600 కోట్ల దాకా ఖర్చు చేస్తుందని తెలుస్తోంది. వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు సమాచారం.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: 100 flights mumbais ani luxury hotel rooms book these are the arrangements for anant ambani wedding
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com