AP BJP: ఏపీలో బీజేపీ రూటు మార్చిందా? పార్టీని ఎలాగైనా బలోపేతం చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా? తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఆశించిన స్థాయిలో పార్టీ బలోపేతం కాకపోవడం వారిని కలవర పరుస్తుందా? అందుకే ఇతర పార్టీల నుంచి చేరికలను పెంచడానికి ప్రయత్నాలు ప్రారంభించారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే విపక్ష నాయకులను టార్గెట్ చేసుకుంటూ బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. తమ రూటులోకి రాని నాయకులను సామ, వేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన విపక్షం టీడీపీ నాయకులను బీజేపీ రూట్లోకి తేవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా వ్యవస్థలను ప్రయోగిస్తున్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ వైసీపీ సర్కారు టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతియడంతో పాటు రాజకీయంగా నిర్వీర్యం చేయడానికి అన్నిరకాల చర్యలు చేపట్టింది. ఇప్పుడు బీజేపీ అధిష్టానం వంతు వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏ క్షణంలోనైనా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లుగానే అధికార, ప్రతిపక్షాలు కదనరంగంలోకి దూకాయి. గడప గడపకు ప్రభుత్వం పేరుతో అధికార పార్టీ, జిల్లాల పర్యటనలో చంద్రబాబునాయుడు ఉన్నారు. జనసేనాని అక్టోబరు 5వ తేదీ నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తుల విషయం ఇంకా ఖరారు కాలేదు. ఇంతవరకూ స్పష్టత రాకున్నా.. వచ్చే ఎన్నికల్లో కలిసి నడవాలని ఇరు పార్టీలు దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చాయి. కానీ బీజేపీ నుంచి ఇంకా సానుకూలత వ్యక్తం కాలేదు. వైసీపీ సహకారం అవసరమో లేక టీడీపీతో కలిసి నడవడం ఇష్టం లేకనో ఆ పార్టీ ఇంకా గోప్యత పాటిస్తోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల నాటికి బలీయమైన శక్తిగా మారాలనుకుంటున్న బీజేపీ తెలుగుదేశం పార్టీపై గురిపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జేసీ సోదరులపై..
రాయలసీమలో బలమున్న నేతలు జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సోదరులు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీని గెలిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అధికార వైసీపీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఓర్చుకొని ముందుకు సాగుతున్నారు. అటువంటి నేతలపై బీజేపీ సైతం ద్రుష్టిపెట్టిందన్న టాక్ నడుస్తోంది. చెన్నై నుంచి వచ్చిన ఈడీ ప్రత్యేక బృందాలు జేసీ సోదరులు,వారి బంధువులు, అనుచరుల ఇళ్లపై అకస్మాత్తుగా దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీ వర్గాలను నివ్వెరపరిచింది. జేపీ ప్రభాకర్‌రెడ్డికి ఆఫ్రికాలో కూడా వ్యాపారాలున్నాయి. దేనిపై ఈడీకి ఫిర్యాదు అందిందన్నది స్పష్టత లేనప్పటికీ దాడులు మాత్రం జరిగాయి. వాస్తవానికి వారికి దివాకర్ ట్రావెల్స్ పేరుతో రవాణా వ్యాపారం ఉన్నప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై ఉక్కుపాదం మోపారు. గతంలో అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన బస్సులను అక్రమంగా రిజిస్టర్ చేశారన్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేసి జైలుకు వెళ్లొచ్చారు. ఈశాన్య రాష్ట్రాలతో ఈ కేసుకు సంబంధం ఉండటంతో ఏపీ పోలీసులు ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదు ఆధారంగానే ఈడీ సోదాలు చేసిందని జేసీ అనుచరులు చెబుతున్నారు.
Also Read: TS Govt Jobs 2022: తెలంగాణలో మరో 10105 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు
వ్యాపారాలు చేస్తున్న వారిపైనే…
వాస్తవానికి గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత కీలక నేతలు, పారిశ్రామికవేత్తలు బీజేపీ గూటికి చేరారు. దాదాపు ఏపీలో వ్యాపారాలు చేస్తున్న విపక్ష నేతలు బీజేపీలోకి క్యూకట్టారు. జేసీ సోదరులు కూడా వెళతారని భావించినా.. వారు మాత్రం టీడీపీలో ఉండిపోయారు. పార్టీలో యాక్టివ్ గా పనిచేసుకుపోతున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ప్రతికూల ఫలితాలు వచ్చినా.. జేసీ సోదరులు మాత్రం తాడిపత్రి మునిసిపాల్టీని కైవసం చేసుకున్నారు. వారిని టార్గెట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం కేసులు వేసినా వెరవలేదు. ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమలో యాక్టివ్ గా తిరుగుతూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అందుకే బీజేపీ జేసీ సోదరులపై గురిపెట్టిందన్న టాక్ అయితే రాజకీయ సర్కిల్ లో ఉంది. ఇటీవల భారతీయ జనతాపార్టీ ఏపీ ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్ జేసీ ప్రభాకర్‌రెడ్డితో సమావేశమయ్యారు. తమ పార్టీలో చేరమని కోరారు. ఆయన నిరాకరించడంతో ఈడీ దాడులు జరిగాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఢిల్లీలోని పెద్దలు మాత్రం నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేస్తే ఆ లోటును బీజేపీతో భర్తీచేయాలనేది కేంద్ర పెద్దల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఏమాత్రం బలంలేని, కనీసం ఒకశాతం ఓటుబ్యాంకు కూడా లేని బీజేపీలో చేరడంవల్ల ఎటువంటి రాజకీయ జీవితం ఉండదనేది ఏపీలోని అన్ని పార్టీల నేతల ఏకాభిప్రాయంగా ఉంది.
బలమున్న నేతలపై..
ఏపీలోని అన్ని ప్రాంతాల్లో బలం, బలగమున్న టీడీపీ నేతల జాబితాను బీజేపీ పెద్దల వద్ద ఉంది. వారి బలం ఏమిటి? బలహీనతలు ఏమిటన్నదానిపై ఆరాతీయడం ప్రారంభించారు. ప్రధానంగా వ్యాపారాలు నడుపుతున్న వారిని టార్గెట్ చేస్తే బీజేపీ వైపు మరలుతారని వారంతా భావిస్తున్నారు. తె రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన సూచనల మేరకు ఎవరెవరు పార్టీలోకి వస్తే బాగుంటుందో ఆలోచించుకొని వారందరితో సునీల్ దేవధర్ మాట్లాడుతున్నారు. ఎవరెవరితో మాట్లాడారన్నది పూర్తిగా తెలియనప్పటికీ చాలామంది నిరాకరించినట్లు తెలుస్తోంది. కోస్తాకు చెందిన ఒక బలమైన తెలుగుదేశం పార్టీ నేతతో కూడా మాట్లాడారని, ఆయన ఎటువంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. నిరాకరించినంతమాత్రాన ఈడీతో, సీబీఐతో వేధింపులకు పాల్పడటం మాత్రం సరైన రాజకీయం అనిపించుకోదంటూ బీజేపీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ఇప్పుడు జేసీ సోదరులపై దాడులు జరిగాయి.. రేపు ఎవరి నివాసంలోనే, కార్యాలయంలోనే మళ్లీ ఈడీ దాడులు జరుగుతాయో.. ఆ నేతలతో బీజేపీ నేతలు మాట్లాడినట్లుగా అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయకుండా ఇతర పార్టీ నేతల చేరికలతో ఏ మాత్రం ప్రయోజనం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గడిచిన ఎన్నికల అనంతరం చాలామంది నాయకులు బీజేపీ గూటికి చేరినా ఓటు శాతం పెరగకపోవడాన్ని ఉదహరిస్తున్నారు.
Also Read:Unemployed in AP: జాబు లేదు..కేలండర్ లేదు.. ఉద్యోగాల భర్తీని మరిచిన ఏపీ సర్కారు
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Bjp has changed its route in ap tdp leaders are the target
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com