BJP Focus On Uttarandhra: ఉత్తరాంధ్రపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? అధికార, ప్రధాన ప్రతిపక్ష అసంతుష్ట నేతలపై ద్రుష్టి పెట్టిందా? వచ్చే ఎన్నికల నాటికి గౌరవప్రదమైన అసెంబ్లీ సీట్లు దక్కించుకునేందుకు పావులు కదుపుతుందా? దీనికి కార్యాచరణ సిద్ధం చేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందులో భాగంగానే బీజేపీ నాయకులు ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల బాట పట్టినట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పక్కన పడేసింది.
గత ప్రభుత్వాల హయాంలో సగానికి పైగా నిర్మాణాలు పూర్తయినా శతశాతం పూర్తి చేయడానికి కనీస ప్రయత్నాలు చేయలేదు. ఎప్పటికప్పుడు గడువు పెంచుతూ వచ్చిన వైసీపీ సర్కారు మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసింది. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తిచేసిన దాఖలాలు లేవు. ఉత్తరాంధ్రలో వంశధార ఫేజ్2 రిజర్వాయర్, వంశధార, నాగావళి అనుసంధానం, తోటపల్లి, తారకరామతీర్థ సాగర్, వెంగళరాయసాగర్, తాటిపూడి ఆధునీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులు బాలారిష్టలు దాటడం లేదు.
Also Read: TDP: భ్రమలు వీడెదెన్నడు.. ప్రజా పోరాటాలకు దూరంగా పచ్చ పార్టీ
ఆ ప్రాంత అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. అలాగని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సైతం కనీసం వాటి ప్రస్తావనే చేయడం లేదు. దీంతో ప్రభుత్వంలో అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుల సందర్శన పేరుతో వాటి పనులు వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. పనిలో పనిగా ఉత్తరాంధ్రలో కీలక నాయకులను బీజేపీ గూటికి చేరేలా భారీ స్కెచ్ వేస్తోంది. బీజేపీ రాష్ట్ర బాధ్యుడు సునీల్ దేవదర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కీలక నేతలు పురందేశ్వరి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తదితర అతిరథ మహారథులు ప్రాజెక్టుల బాటకు రానున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో రాజకీయాలు హీటెక్కే అవకాశముంది.
గతమెంతో వైభవం
వాస్తవానికి ఉత్తరాంధ్రలో బీజేపీకి మంచి పట్టు ఉంది. యువత, తటస్థులు ఎక్కువగా బీజేపీ అంటే మక్కువ చూపుతున్నారు. మోదీ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. అయితే చంద్రబాబుతో పొత్తు పుణ్యమా అని బీజేపీని ఎదగకుండా చేశారు. కేవలం చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడు పొత్తులతో చేరదీసి ఒకటో, రెండో ఎమ్మెల్యే, ఎంపీ పదవులిచ్చి..బీజేపీ గ్రాఫ్ పెరగకుండా చేసుకునేవారు. తద్వారా బీజేపీకి భారీ డ్యామేజ్ జరిగేది. 2019 ఎన్నికల ముందు బీజేపీని మరింత పలుచన చేశారు. నిజంగా అన్యాయం చేసిన కాంగ్రెస్ పక్షాన చేరి బీజేపీని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసి సఫలీక్రుతులయ్యారు. అయితే ప్రస్తుతం ప్రజలకు తత్వం బోధపడుతోంది.
నాడు చంద్రబాబు ఆడిన నాటకాలే రాష్ట్ర ప్రజలకు శాపంగా మారాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాడు ఆయనే సవ్యంగా ఉండి..బీజేపీ సాయం తీసుకొని ఉంటే నేడు రాష్ట్రం పరిస్థితి ఇందాకా వచ్చి ఉండేది కాదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు బీజేపీని డ్యామేజీ చేసి.. తాను నష్టపోయి.. రాష్ట్ర ప్రజలకు తీరని నష్టానికి గురిచేశారని ఎక్కువమంది గుర్తు చేస్తున్నారు. కొవిడ్ ను ధీటుగా ఎదుర్కొవడం, దేశంలో సుస్థిరత ఏర్పాటు చేసుకోవడం, అంతర్జాతీయంగా దేశ ప్రభ వెలుగొందడం వంటి వాటిలో ప్రధాని మోదీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. దాని ఫలితమే దేశ వ్యాప్తంగా బీజేపీ విజయాలు. అయితే ఆంధ్ర ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే వాస్తవాలు గ్రహిస్తున్నారు. బీజేపీని అర్ధం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ నాయకులు ఎటువంటి తప్పిదాలకు అవకాశం లేకుండా చూసుకోవాల్సిన అవసరముంది.
యువతలో ఆదరణ
ఉత్తరాంధ్రలో యువతలో పార్టీకి మంచి ఆదరణే ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది నిరూపితమైంది. బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ ను ఉత్తరాంధ్ర పట్టభద్రగుల తమ ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. గతంలో విశాఖ ఎంపీగా సైతం బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు ఎన్నికయ్యారు. ప్రధానంగా విశాఖ మహానగరంలో ఉత్తరాధి రాష్ట్రాల వారి సంఖ్య అధికం. అందుకే అక్కడ బీజేపీకి చెక్కు చెదరని ఆదరణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం ఉత్తరాంధ్రపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. రామతీర్థం బోడికొండపై సీతారాముల విగ్రహాల ధ్వంసం ఘటనకు సంబంధించి బాగానే రియాక్ట్ అయ్యారు. భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉత్తరాంధ్రలో బీజేపీ ఉనికిని, బలాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ విప్ గద్దె బాబూరావు, మాజీ మంత్రి పడాల అరుణ, టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు కుటుంబసభ్యులను బీజేపీలో చేరికలను ప్రోత్సహించారు. మరి కొద్దిరోజుల్లో అధికార, విపక్ష నాయకులను పార్టీలో చేర్చుకునేలా వ్యూహాలు పన్నుతున్నారు. మొత్తానికి రాష్ట్ర బీజేపీ బలపడడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
Also Read:MLA Roja: ఎమ్మెల్యే రోజా భవితవ్యం ఈ సాయంత్రానికి తేలిపోనుందా?
Web Title: Bjp focus on uttarandhra ap bjp chief somu veerraju jala poru yatra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com