Manmohan Singh Passed Away: జాతీయస్థాయిలో ఏపీది ప్రత్యేక స్థానం. రాజకీయంగాను తెలుగు రాష్ట్రం తనదైన ముద్ర చూపించింది. కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. అప్పుడు, ఇప్పుడు ఈ పరంపర కొనసాగుతోంది. తొలుత ఎన్టీఆర్, తరువాత చంద్రబాబు, అటు తరువాత వైయస్ రాజశేఖర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ రెండుసార్లు ప్రధాని కావడానికి ప్రధాన కారణం ఏపీ. అంతకుమించి వైయస్ రాజశేఖర్ రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ కు తెలుగు రాష్ట్రాలతో మంచి అనుబంధం ఉంది. అప్పట్లో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఏపీ నుంచి ప్రారంభించారు ఆయన. రాష్ట్ర విభజన సైతం ఆయన హయాంలోనే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో విరివిగా పర్యటించేవారు మన్మోహన్ సింగ్. హైదరాబాదులో పలు పథకాలకు ఆమోదంలోనూ మన్మోహన్ ముద్ర స్పష్టంగా కనిపించింది. సుదీర్ఘ విరామం తర్వాత 2004లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీ విదేశీయత అంశం తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన మన్మోహన్ సింగ్ కు.. అనూహ్యంగా ప్రధాని పదవి వరించింది. దాదాపు పది సంవత్సరాల పాటు ఆయన ప్రధాని పదవిలో కొనసాగారు. ఒక నేత వరుసగా పదేళ్ల పాటు పదవిలో కొనసాగడం విశేషమే.
* ఉమ్మడి ఏపీ నుంచి 33 మంది ఎంపీలు
2009లో రెండోసారి ప్రధాని అయ్యారు మన్మోహన్ సింగ్. అయితే అందుకు కారణం మాత్రం ఏపీతోపాటు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని సగర్వంగా చెప్పేవారు మన్మోహన్ సింగ్. పలు సందర్భాల్లో మన్మోహన్ చెప్పిన విషయాలను నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో 33 మంది ఎంపీలు గెలిచారు. వారి గెలుపు వెనుక వైయస్సార్ కారణమని మన్మోహన్ సింగ్ విశ్వసించారు. నాడు త్రిముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీ వంటరి పోరాటం చేసి విజయం సాధించింది. ప్రజారాజ్యం పార్టీ ఎంట్రీ ఇచ్చింది ఆ ఎన్నికల్లోనే. ఇక టిడిపి, టిఆర్ఎస్, వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయినా సరే రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కేంద్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేందుకు అవసరం అయిన ఎంపీలను అందించింది. అందుకే మన్మోహన్ సింగ్ ఏపీ పట్ల ప్రత్యేక అభిమానం కనబరిచేవారు. రాజశేఖర్ రెడ్డి కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
* ప్రధాని హోదాలో చాలాసార్లు
జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభోత్సవానికి మన్మోహన్ సింగ్ ప్రధాని హోదాలో హాజరయ్యారు. అనంతపురం జిల్లా నార్పల మండలంబండ్లపల్లి గ్రామంలో 2006,ఫిబ్రవరి 2న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. యూపీఏ అధికారం కోల్పోయిన తర్వాత కూడా మాజీ ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ అనంతపురం వచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో హైదరాబాద్ కు.. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నవేళ హైదరాబాదులో బాంబు పేలుళ్లు జరిగిన సమయంలో సైతం మన్మోహన్ రాష్ట్రానికి వచ్చారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు శ్రీకాళహస్తి వద్ద జరిగిన పలు కార్యక్రమాల్లో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. హైదరాబాద్ కు మెట్రో, ఓ ఆర్ ఆర్, విమానాశ్రయ విస్తరణ పనులకు మన్మోహన్ పూర్తిస్థాయిలో సహకరించారు. ఏపీ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.