https://oktelugu.com/

జనహృదయ నేత, దళిత గొంతుక రామ్‌ విలాస్‌ పాశ్వాన్ స్పెషల్ స్టోరీ!

దళిత దిగ్గజం, లోక్ జన్ శక్తి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, కేంద్రమంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. పాశ్వాన్ మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జన హృదయ నేతగా పేరు తెచ్చుకున్న పాశ్వాన్ మృతితో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ 1946 సంవత్సరం జులై నెల 5వ తేదీన బీహార్ లోని ఖగారియా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 9, 2020 / 07:12 AM IST
    Follow us on

    దళిత దిగ్గజం, లోక్ జన్ శక్తి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, కేంద్రమంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. పాశ్వాన్ మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జన హృదయ నేతగా పేరు తెచ్చుకున్న పాశ్వాన్ మృతితో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

    రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ 1946 సంవత్సరం జులై నెల 5వ తేదీన బీహార్ లోని ఖగారియా జిల్లా షహర్భానీ ప్రాంతంలో జన్మించారు. దళిత కుటుంబంలో జన్మించిన పాశ్వాన్ న్యాయవిద్యను అభ్యసించారు. చిన్నప్పటి నుంచి పాశ్వాన్ కు రాజకీయాలంటే అమితమైన ఆసక్తి. 22 సంవత్సరాల వయస్సులోనే డీఎస్పీగా పాశ్వాన్ కు ఉద్యోగం వచ్చింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.

    స్నేహితులు, కుటుంబ సభ్యులు డీఎస్పీ ఉద్యోగంలో చేరాలని సూచించినా పాశ్వాన్ మాత్రం సోషలిస్ట్ భావాలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సంయుక్త సోషలిస్ట్ పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పాశ్వాన్ ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపి అనంతరం జనతా పార్టీలో చేరారు. జనతా టికెట్ తో 1977లో బీహార్ లోని హజ్ పూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.

    ఆ తరువాత కూడా అదే నియోజకవర్గం నుంచి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసిన పాశ్వాన్ ఎనిమిదిసార్లు గెలిచారు. పాశ్వాన్ పేరుపై ప్రపంచ రికార్డు కూడా ఉంది. 1977లో 4.24 లక్షల మెజార్టీతో గెలిచి పాశ్వాన్ ప్రపంచ రికార్డును సృష్టించారు.ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడు పాశ్వాన్ స్థాయిలో మెజారిటీని పొందలేదు. దేశవ్యాప్తంగా ఉన్న దళితుల ఆకాంక్షలకు చిహ్నంగా వారి అభ్యన్నతే లక్ష్యంగా పాశ్వాన్ కృషి చేశారు. 1989లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మంత్రివర్గంలో కార్మిక శాఖా మంత్రిగా, 1996లో దేవెగౌడ మంత్రి వర్గంలో రైల్వే మంత్రిగా పాశ్వాన్ పనిచేశారు.

    2000 సంవత్సరంలో పాశ్వాన్ కొందరు నాయకుల మద్దతుతో లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ)ని స్థాపించారు. 2004లో యూపీఏ కూటమిగా చేరి పాశ్వాన్ ఎరువులు, రసాయన శాఖ, ఉక్కు మంత్రిగా పని చేశారు. లోక్ సభ ఎన్నికల్లో హజీపూర్ నుంచి 10సార్లు పోటీ చేసి ఎనిమిది సార్లు గెలిచిన పాశ్వాన్ 2010లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో వివిధ కారణాల వల్ల లోక్ సభకు పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు.

    పాశ్వాన్ అటు యూపీఏ ప్రభుత్వంలోనూ, ఇటు ఎన్డీఏ ప్రభుత్వంలోనూ కీలక నేతగా వ్యవహరించారు. రాజకీయ విశ్లేషకులు ఆయన దళిత సంఘాలకు పెద్ద దిక్కుగా వ్యవహరించారని చెబుతూ ఉంటారు. మరికొన్ని రోజుల్లో బీహార్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాశ్వాన్ మృతి ఎల్జీపీ పార్టీకి తీరని దెబ్బ అనే చెప్పాలి. ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల బాధ్యతలు చూస్తున్న పాశ్వాన్ మృతి చెందడంతో ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, సీఎం జగన్, సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

    ఖగాడియా జిల్లా షహర్బానీలో సియాదేవి, జమున్ పాశ్వాన్ దంపతులకు జన్మించిన పాశ్వాన్ రాజకీయాల్లో తిరుగులేని ప్రయాణాన్ని కొనసాగించారు. పాశ్వాన్ మొదట రాజ్ కుమార్ దేవిని వివాహం చేసుకుని ఇద్దరు కుమార్తెలు జన్మించిన తరువాత ఆమెకు విడాకులిచ్చారు. అనంతరం పాశ్వాన్ రీనా శర్మను వివాహమాడగా వీరికి కొడుకు, కూతురు ఉన్నారు.