
కృష్ణాజిల్లాలో మూడు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఉదయం మిస్సన్నపేట శివారులో చెట్లపొదల్లో ఉన్న ఈ మృతదేహాలను ముందుగా స్థానికులు గుర్తించారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాటిని పరిశీలించగా అందులో మహిళ, యువతితో పాటు యువకుడి మృతదేహాలు ఉన్నాయి. వీరు నూజివీడు మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. కాగా మృతదేహాల సమీపంలో ఆటో ట్రాలీ కూడా ఉంది. ఇది హత్యా..? లేక ఆత్మహత్యా..? అని తేలకపోవడంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు.