Homeఆంధ్రప్రదేశ్‌YCP Party : అర్జెంటుగా ట్రబుల్ షూటర్ కావలెను.. అన్వేషణలో వైసిపి!

YCP Party : అర్జెంటుగా ట్రబుల్ షూటర్ కావలెను.. అన్వేషణలో వైసిపి!

YCP Party :  వైసిపి( YSR Congress ) అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ ఇప్పుడప్పుడే గట్టెక్కే పరిస్థితుల్లో లేదు. గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల్లో గౌరవప్రదమైన ప్రతిపక్ష స్థానాలు వచ్చాయి. దాదాపు అధికారానికి చేరువైంది. 2019లో అయితే ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేసింది. అపరిమిత విజయాన్ని పొందింది. 2024 లో మాత్రం అంతే అపరిమితమైన ఓటమిని మూటగట్టుకుంది. అయితే రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజం. అయితే నేతలు తారుమారు అవుతుండడం.. అస్సలు ఊహించని నేతలు పార్టీలు మారుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఫలానా నేత.. ఫలానా పార్టీకి మాత్రమే పరిమితం అన్నట్టు ఉండే తీరుకు ఇప్పుడు భిన్న పరిస్థితి ఏర్పడింది. సిద్ధాంతాలతో పని లేకుండా కేవలం అధికారం చుట్టూనే తిరిగే నేతల సంఖ్య ఎక్కువైపోయింది. అయితే ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ బాధిత పార్టీ. కానీ ఇప్పుడు వైసీపీలో సైతం అదే పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. విధేయత విషయంలో చంద్రబాబు కంటే.. జగన్ ను ఎక్కువ మంది నమ్ముతారు. కానీ జగన్ విధేయులైన నేతలే ఇప్పుడు ఆయనకు నట్టేట ముంచి వెళ్తున్నారు. దీంతో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.

జగన్( Jagan Mohan Reddy) కష్టాల్లో ఉంటే ఇట్టే ఎంట్రీ ఇచ్చేవారు విజయసాయిరెడ్డి. 2014లో ప్రతిపక్షానికి జగన్ పరిమితం అయినప్పుడు జాతీయస్థాయిలో అన్ని పనులు చక్కబెట్టారు. బిజెపి పెద్దలను ఒప్పించారు మెప్పించారు. వారిని పొగడ్తలతో ముంచెత్తడానికి ప్రత్యేక సోషల్ మీడియా టీంనే నడిపారు. జగన్ కోసం కేంద్ర పెద్దలకు సాష్టాంగ నమస్కారాలు కూడా చేశారు. టిడిపి ఎన్ డి ఏ నుంచి బయటకు వెళ్లడానికి.. ఆ ప్లేస్ లో వైసీపీ రావడానికి కృషిచేసిన ఒకే ఒక నేత మాత్రం విజయసాయిరెడ్డి. జగన్ రాజకీయాల్లోకి రాక మునుపు.. వచ్చిన తర్వాత.. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అధికారానికి వచ్చినప్పుడు.. తాజాగా ఘోర పరాజయం ఎదురైనప్పుడు.. ఇలా అన్ని సమయాల్లో జగన్ కు అండగా నిలబడ్డారు. ట్రబుల్ షూటర్ గా నిలిచారు. అటువంటి నేత పార్టీకి గుడ్ బై చెప్పడం నిజంగా లోటే.

* ఎంతోమంది సన్నిహితులు
వాస్తవానికి జగన్ కు వైసీపీలో( YSR Congress ) అత్యంత సన్నిహిత నేతలు చాలామంది ఉన్నారు. రాజకీయంగా విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వ్యాపార భాగస్వామ్యులుగా నిరంజన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఇక రాజకీయ విధేయులుగా కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నా రాజకీయంగా మంత్రాంగం నడిపేవారు మాత్రం లేకుండా పోయారు. ఇప్పటివరకు ఆ పాత్రలో విజయసాయిరెడ్డి ఒదిగిపోయారు.

* కష్టపడే నేత కావాలి
ఇప్పుడు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కీలక రాజకీయ మంత్రంగం నడపాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో( BJP) సంధి నడపాలి. అదే సమయంలో పార్టీలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లకుండా ఆపాలి. కానీ ఆ పని చేసేవారు ఇప్పుడు వైసీపీలో కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పని చేయగల సమర్థత బొత్స సత్యనారాయణ కు ఉంది. కానీ ఆయన సైతం వేరే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్యంత విధేయత కలిగిన నేత అయినా.. ఆయన సైతం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు మౌనముని అవతారం ఎత్తారు. కొడాలి నాని కనిపించకుండా పోయారు. పేర్ని నాని అయితే నోరు మెదపడం లేదు.

* అటువంటి నేత దొరుకుతారా?
ప్రస్తుతం వైసీపీకి( YSR Congress ) అత్యవసరంగా ట్రబుల్ షూటర్ కావాలి. పార్టీలో వచ్చే సమస్యలను పరిష్కరించే వ్యక్తి కావాలి. అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపే నేత కావాలి. అంతకుమించి వైసిపి తో పాటు జగన్ కు ప్రయోజనం చేకూర్చే నేత కావాలి. పార్టీ పూర్వ వైభవానికి మనస్ఫూర్తిగా పనిచేసే నాయకుడు కావాలి. అయితే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో.. కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉన్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం నిఘా ఉన్న తరుణంలో.. అటువంటి ట్రబుల్ షూటర్ దొరుకుతారా? అంటే వైసిపి వైపు నుంచి సమాధానాలు దొరకడం లేదు. మరి జగన్ తో పాటు వైసిపికి అండగా నిలిచే ఆ ట్రబుల్ షూటర్ ఎవరో భవిష్యత్తు తేలుస్తుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version