YSRCP MPs goodbye: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం పదవులను వదులుకొని కూటమి పార్టీల్లో చేరారు. దీంతో రాజ్యసభ తో పాటు శాసనమండలిలో ఆ పార్టీ బలం రోజురోజుకు తగ్గుముఖం పట్టింది. ఇటీవల ఇటువంటి రాజీనామాలు తగ్గాయి. కానీ ఇప్పుడు మరో ప్రచారం మొదలైంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతారని టాక్ నడుస్తోంది. తమపై ఉన్న కేసులతో వారు బిజెపిలో చేరుతారని పొలిటికల్ సర్కిల్లో తెగ సర్కులేట్ అవుతోంది ఒక వార్త. ముఖ్యంగా ఓ ముగ్గురు రాజ్యసభ సభ్యుల పేర్లు వినిపిస్తున్నాయి.
తగ్గుతున్న బలం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ( mopi Devi Venkataramana ), బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీలో చేరారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోయింది. ఇంకోవైపు విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. వైసీపీకి అప్పటివరకు ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల బలం ఏడుకు పడిపోయింది. ఇక మిగిలింది ఏడుగురు మాత్రమే. అయితే ఈ ఏడాది జూన్లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీ విరమణ చేయనున్నారు. అంటే ఇక మిగిలేది నలుగురు మాత్రమే. వై వి సుబ్బారెడ్డి ప్రస్తుతం రాజ్యసభలో వైసిపి పక్ష నేతగా ఉన్నారు. అయితే ఆయన సైతం బిజెపిలో చేరుతారని కొత్త ప్రచారం ప్రారంభం అయింది. టీటీడీ కేసులకు సంబంధించి ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అందుకే ఆయన సైతం వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే మిగతా ముగ్గురు రాజ్యసభ సభ్యులు సైతం ఆయనను అనుసరించే అవకాశం ఉంది.
లోక్ సభ నుంచి ఆ ఇద్దరు..
లోక్సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. కడప నుంచి గెలిచిన అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి గెలిచిన మిధున్ రెడ్డి, తిరుపతి నుంచి గెలిచిన గురుమూర్తి,, అరకు నుంచి గెలిచిన తనుజారాణి ఉన్నారు. అయితే ఈ నలుగురు నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తులైన వారే. అయితే ఇప్పుడు వైయస్ అవినాష్ రెడ్డి తో పాటు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బిజెపిలో చేరుతారని ప్రచారం నడుస్తోంది. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి.. లిక్కర్ స్కామ్ కేసులో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఇరుక్కున్నారు. ఆ కేసుల నుంచి బయటపడేందుకు వారు వైసీపీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరుతారని ప్రచారం నడుస్తోంది. అయితే వారిద్దరూ వెళ్ళిపోతే మిగతా ఇద్దరు ఎంపీలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పక తప్పదు. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో చూడాలి.