Mithun Reddy Gets Interim Bail: ఏపీలో( Andhra Pradesh) టిడిపి కూటమి ప్రభుత్వానికి షాక్ తగిలింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి కోర్టు బెయిల్ ఇచ్చింది. గత కొంతకాలంగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పై అభియోగాలు మోపింది. ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది. గత కొన్ని రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ న్యాయస్థానంలో చుక్కెదురవుతూ వచ్చింది. అయితే ఆయనకు తాజాగా మధ్యంతర బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదల కానున్నారు.
కొద్దిరోజుల కిందట అరెస్ట్..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో మద్యం కుంభకోణం జరిగింది. దాదాపు 18 వేల కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం కుంభకోణం పై ఫోకస్ పెట్టింది. దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం సిట్ ను ఏర్పాటు చేసింది. గత కొంతకాలంగా విచారణను కొనసాగించిన సిట్.. కేసులో 12 మంది నిందితులను అరెస్టు చేసింది. అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు మాత్రం సంచలనమే. మద్యం కుంభకోణం లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ అభియోగాలు మోపింది. కోర్టుకు ఆధారాలు కూడా చూపించింది. దీంతో ఆయనకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అయితే అప్పటినుంచి బెయిల్ కు ప్రయత్నించినా దొరకలేదు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు
మరోవైపు మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( pedhi Reddy Ramachandra Reddy ) రాజమండ్రిలోనే ఉంటున్నారు. కోర్టు అనుమతితో మిధున్ రెడ్డికి ఇంటి భోజనం జైలుకు తీసుకెళ్తున్నారు. అయితే బెయిల్ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ఎప్పటికప్పుడు కోర్టు విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ తరుణంలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి మద్యం తరపు బెయిల్ రావడం విశేషం. ఈనెల తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఓటు వేసేందుకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మిధున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిరిగి ఈనెల 11న సాయంత్రం ఐదు గంటలకు సరెండర్ కావాలని కోర్టు షరతు విధించింది. ఈరోజు సాయంత్రం మిధున్ రెడ్డి జైలు నుంచి బయటకు రానున్నారు. మొత్తానికైతే సుదీర్ఘ విరామం తర్వాత మిధున్ రెడ్డి జైలు నుంచి బయటకు వస్తుండడం పై వైసిపి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.