Chandragiri Yesuratnam : శాసనమండలిలో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైసీపీ. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి.. కేవలం 11 సీట్లు మాత్రమే లభించాయి. అయితే శాసనమండలిలో ఉన్న మెజారిటీతో కూటమితో ఒక ఆట ఆడుకుందాం అని జగన్ భావించారు. కానీ వైసీపీ సభ్యులను నిర్వీర్యం చేయడం ద్వారా బలం పెంచుకోవాలని కూటమి భావిస్తోంది. ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. మండలి చైర్మన్ మోషన్ రాజు వద్ద అవి పెండింగ్లో ఉండిపోయాయి. అయితే దీనిపై వారంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. అయితే ఇంతలో మరో ఎమ్మెల్సీ వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం ప్రారంభం అయింది.
* అరుదైన అవకాశం ఇచ్చిన జగన్
గత ఐదేళ్లలో చాలామందికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు జగన్. అందుకే 38 మంది ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఆ పార్టీకి ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు కొందరు రాజీనామా చేశారు. మరికొందరు చట్టసభల్లో అడుగు పెట్టారు. ఇప్పుడు పదవులకు వరుసగా రాజీనామా చేస్తున్నారు. దీంతో క్రమేపి వైసిపి బలం తగ్గుముఖం పడుతుంది. ఈ తరుణంలో మరో ఎమ్మెల్సీ జంప్ అంటూ ప్రచారం నడుస్తోంది. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన చంద్రగిరి ఏసురత్నం పార్టీకి గుడ్ బై చెబుతారని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. 2018లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు. ఓడిపోవడంతో ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు జగన్. ఆయన పదవీకాలం 2029 వరకు ఉంది.
* ఎమ్మెల్యేగా పోటీకోసమే
2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నది ఒక అంచనా. అప్పుడు సీట్ల సంఖ్య పెరుగుతుందని.. తప్పకుండా తనకు పోటీ చేసే ఛాన్స్ వస్తుందని ఏసురత్నం భావిస్తున్నారు. అందుకే జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగానే జనసేనలోకి వెళ్తే.. ఎన్నికల్లో పోటీకి పవన్ ఎలాగైనా అవకాశం ఇస్తారని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఏసు రత్నం తీరులో కూడా మార్పు వచ్చింది. తరచూ కూటమి పాలనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అనుచరులకు కూడా స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే మాత్రం వైసీపీకి మరో షాక్ తప్పేలా లేదు.