Janasena : ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. జనసేన చుట్టూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వారాహి యాత్రతో ఊపు మీద ఉన్న పవన్… పనిలో పనిగా పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇతర పార్టీల నుంచి చేరికల సంఖ్య ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ నుంచి భారీగా చేరికలకు అవకాశముంది. మొన్నటివరకూ టీడీపీలో చేరుతామన్న నాయకులు సైతం ఇప్పుడు మనసు మార్చుకుంటున్నారు. జనసేన అయితేనే బాగుంటుందన్న డిసైడ్ కు వస్తున్నారు.
ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేనలో చేరారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు పవన్ ను కలిశారు. పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మరో ఇద్దరు మాజీ మంత్రులు సైతం జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నారు. వీరిరువురు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులు కావడం విశేషం. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. ఇప్పుడు పవన్ వెంట నడవాలని నిర్ణయానికి వచ్చారు మాజీ మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, కొణతాల రామక్రిష్ణలు.

కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు డీఎల్ రవీంద్రారెడ్డి. మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టారు. కానీ ఎన్నికల అనంతరం వైసీపీకి దూరమవుతూ వచ్చారు. జగన్ సర్కారు పాలనా వైఫల్యాలపై విమర్శలు సంధిస్తున్నారు. ఆయన టీడీపీలో చేరుతారని అంతా భావించారు. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన అయితే సరైన వేదిక అవుతుందని భావిస్తున్నారు. అందుకే పవన్ తో ఒకసారి చర్చించి పార్టీలో చేరాలన్న అభిమతం తెలియజేస్తారు.
అనకాపల్లి నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా కొణతాల రామక్రిష్ణ ప్రాతినిధ్యం వహించారు. 1989, 1991 లో ఎంపీగా గెలుపొందారు. 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. వైసీపీ ఆవిర్భావం తరువాత జగన్ వెంట నడిచారు. 2014లో విశాఖ ఎంపీగా పోటీచేసిన విజయమ్మ తరుపున విస్తృతంగా ప్రచారం చేశారు. 2019లో మాత్రం టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు. ఇటీవల టీడీపీలో చేరతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా జనసేన వైపు ఆయన మనసు మళ్లింది. పవన్ తో భేటీ తరువాత జనసేనలో చేరికపై స్పష్టతనిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మొత్తానికైతే పవన్ ఇలా గేట్లు ఎత్తేరో లేదో.. జనసేనలో చేరికల సంఖ్య పెరుగుతోంది.