YSRCP Leaders Bail: శివుడు ఆజ్ఞ లేనిదే.. చీమైనా కుట్టదు అనేది భక్తుల అపార నమ్మకం. అటువంటిదే కేంద్రం ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు అనేది బలమైన ప్రచారం. మోడీ( Prime Minister Narendra Modi) ఆదేశిస్తే ఈడి ఎంటర్ అవుతుందని.. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయని బలమైన ప్రచారం జాతీయస్థాయిలో ఉంది. రాజ్యాంగ వ్యవస్థగా ఉన్న ఈసీని సైతం బిజెపి మేనేజ్ చేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. కేంద్రంతో పెట్టుకుంటే కేసులు.. రాజీ పడితే రాజకీయాలు చేయవచ్చన్న కామెంట్స్ బలంగా ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరు జైళ్ళ నుంచి బయటకు వస్తుండడం విశేషం. తెర వెనుక బిజెపి సాయంతోనే వారు వరుసగా బెయిల్ పొందుతున్నారన్న కామెంట్స్ ఏపీలో బలంగా వినిపిస్తున్నాయి. 85 రోజుల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. అయితే సరిగ్గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపి బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించిన తరువాత ఈ బెయిల్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: ఏపీలో ఫ్రీ బస్.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?
అప్పట్లో చంద్రబాబు..
2019 నుంచి 2024 మధ్య భారతీయ జనతా పార్టీతో( Bhartiya Janata Party) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరోక్ష స్నేహం కొనసాగించింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు.. బిజెపిని చంద్రబాబు వ్యతిరేకించడంతో.. ఆ పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహకరించింది. ఐదేళ్ల పాటు ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. దీని వెనుక బిజెపి సహకారం ఉంది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేయించారు. అసలు ఆధారాలే లేని కేసుల్లో 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. ఆ సమయంలోనే నారా లోకేష్ ఢిల్లీ బాట పట్టారు. బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపారు. అటు తరువాత చంద్రబాబుకు బెయిల్ లభించింది. ఆ తరువాతే బిజెపి, జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. అంటే అప్పట్లో కూడా బిజెపి మద్దతుతోనే చంద్రబాబు బెయిల్ పొందారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. రాజకీయ మేధావులైన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా దీనిని తరచూ ఉటంకిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రధాన తప్పిదం అదేనని గుర్తు చేస్తుంటారు.
వైసీపీ నేతలపై కేసులు..
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగింది. వైసీపీ హయాంలో అవినీతి పాల్పడ్డారని కొందరిపై, దూకుడుగా వ్యవహరించారని ఇంకొందరిపై, అనుచిత వ్యాఖ్యలు చేశారని మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. పెద్ద ఎత్తున అరెస్టుల పర్వం నడిచింది. మద్యం కుంభకోణంలో దాదాపు 12 మంది అరెస్టయ్యారు. వారంతా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కూడా. ఒక విధంగా చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వారు మూల స్తంభాలు. అయితే చాలామందికి బెయిళ్లు లభిస్తున్నాయి. అయితే ఇలా బెయిల్ పొందడం అనేది ఇటీవల మాత్రమే సాధ్యమవుతుంది. అది కూడా ఎన్డీఏ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన తర్వాతే కావడం గమనార్హం.
Also Read: ఫ్రీ బస్సు ఎఫెక్ట్ : ఏపీ బస్సుల్లో మహిళల కొట్లాట మొదలైంది.. వీడియో
మాజీమంత్రి కి బెయిల్..
నెల్లూరు జిల్లాలో( Nellore district) మైనింగ్ కు సంబంధించి అవినీతికి పాల్పడ్డారని కారణం చూపుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి పై కేసు నమోదయింది. 85 రోజుల కిందట ఆయన అరెస్టయ్యారు. నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయన చాలాసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ న్యాయస్థానంలో మాత్రం బెయిల్ లభించలేదు. అయితే ఇటీవల ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరుతూ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. అలా అడిగారో లేదో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపింది. అయితే అక్కడకు రోజు వ్యవధిలోనే మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. దీంతో బలమైన హామీ తోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపి బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.