YSRCP : ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతల పరిస్థితి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఇంకా కూటమికి నాలుగేళ్ల పదవీకాలం ఉంది. అయితే 2029 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనంటూ వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే పలానా పదవి తమదేనంటూ చెప్పుకొస్తున్నారు. మరోవైపు నేతల భార్యలు సైతం పెద్ద పెద్ద పదవులు తమ వేనంటూ బాహటంగా చెబుతున్నారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని వారు సైతం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండడం విశేషం. అయితే తాజాగా మాజీ ఎంపీ నందిగాం సురేష్ భార్య బేబీ లత అయితే.. తనను హోం మంత్రి అంటూ అంతా పిలుస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఆమెకు సంబంధించి ఓ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీవ్ర చర్చకు దారితీస్తోంది.
* ఇటీవల యాక్టివ్
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్( nandigam Suresh ) ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ఓ హత్య కేసులో అరెస్టు చేశారు. సుమారు మూడు నెలల పాటు ఆయన గుంటూరు జైల్లోనే గడిపారు. మొన్న ఆ మధ్యన బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఇటీవల మరో కేసులో అరెస్టయ్యారు. అయితే సురేష్ ఎంపీగా ఉండగా ఆయన భార్య బేబీ లత ఎన్నడూ బయటకు రాలేదు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత తరచూ జైలుకు రావడం, బెయిల్ ప్రయత్నాలు చేయడం వంటివి చేస్తూ వస్తున్నారు. అయితే ఆమె ఓ మహిళ న్యాయవాదితో చేసిన సంభాషణ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని.. మీరు హోం మంత్రి అవుతారని ఆ న్యాయవాది చెప్పిన ఆడియో రాజాగా వైరల్ అవుతోంది. అయితే మీరు ఒక్కరే కాదు చాలామంది అలానే అంటున్నారని.. అలా అనడం చాలా ఆనందంగా ఉందని బేబీ లత బదులు ఇవ్వడం విశేషం.
Also Read : వైసీపీకి నడిపించే నాయకులు కావలెను.. ఆ 100 నియోజకవర్గాల్లో లోటు*
* ఆసక్తికర సంభాషణ..
మాజీ ఎంపీ సురేష్ తరపున ఆయన కేసులను వాదిస్తున్న ఓ మహిళా న్యాయవాది ఇటీవల ఆయన భార్య బేబీ లతకు( baby Lata ) ఫోన్ చేశారట. ఈ సందర్భంగా వారి మాటల మధ్యలో ఈసారి సురేష్ బదులుగా బేబీ లతకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్ర హోం మంత్రి అవుతారంటూ ఆ న్యాయవాది చెప్పినట్లు ఆ ఆడియో లో ఉంది. అదే సమయంలో తాను సురేష్ తో ములాకత్ అయ్యేందుకు జైలుకు వెళ్ళగా.. అక్కడ గతంలో తనతో దురుసుగా వ్యవహరించిన ఓ సి ఐ కూడా ఇదే మాదిరిగా అన్నారని బేబీ లతా చెప్పుకొచ్చారు. మీరు కాబోయే హోం మంత్రి.. మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అంటూ ఆ సీఐ తనతో చెప్పినట్టు బేబీ లత ఆడియోలో పేర్కొన్నారు. అయితే ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉంది. అప్పుడే పదవుల కోసం కలలు కంటున్నారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అయితే ఈ ఆడియో పై బేబీ లత కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంతవరకు స్పందించలేదు.
