PM Modi AP Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను సైతం రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించడమే కాకుండా, ఫేక్ ప్రచారానికి వేదికగా మార్చిందంటూ వైసీపీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వినతిపత్రం ఇవ్వకుండానే ఫేక్ ప్రచారం!
ప్రధాని పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వైసీపీ నేతలు ఎటువంటి అధికారిక వినతిపత్రం ఇవ్వకుండానే, ‘మెడికల్ కాలేజీలు, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలనే అభ్యర్థనలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లామ’ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారని సమాచారం. అయితే, ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి, ప్రధానికి ఎలాంటి వినతిపత్రం ఇవ్వలేదని, కానీ తమ అభ్యర్థనలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం చేయడం ఫేక్ న్యూస్‌గా తేలిందని అధికారులు స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం గౌరవాన్ని కూడా రాజకీయం!
మరో గమనించాల్సిన విషయం ఏంటంటే, అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రతిపక్ష పార్టీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం ఇవ్వని వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందన్న విమర్శలు వస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న ప్రతి ప్రధాన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రోటోకాల్ పాటిస్తూ ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇస్తోందని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రధాని పర్యటనలో లభించిన గౌరవాన్ని తమ ఫేక్ ప్రచారానికి వాడుకున్న వైసీపీ ధోరణి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.