YSRCP and BRS: తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి, బిఆర్ఎస్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆ రెండు పార్టీలకు ఉమ్మడి ప్రత్యర్థి చంద్రబాబు. ఆపై కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైన ద్వేషం. బిజెపి విషయంలో సరైన స్టాండ్ లేదు. తమ సొంత రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డారన్న విమర్శ అటు కెసిఆర్, ఇటు జగన్మోహన్ రెడ్డి లపై ఉంది. ముందుగా కేసిఆర్ అధికారానికి దూరమయ్యారు. తరువాత జగన్మోహన్ రెడ్డి వంతు వచ్చింది. రాజకీయంగా ఇద్దరి పరిస్థితి గడ్డు స్థితిలో ఉంది. పైగా సమీప బంధువులు, కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలా సొంత కుటుంబ సభ్యులే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణలో సొంత కుటుంబ సభ్యులపై విమర్శలు చేశారు కేసీఆర్ కుమార్తె కవిత. అయితే ఏపీలో సైతం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సైతం ఇదే తరహా ఆరోపణలు చేశారు. దీంతో ఆ రెండు పార్టీల మధ్య భావ సారూప్యత కొనసాగుతోంది.
హరీష్ రావు మూలంగా అగాధం
తాజాగా తెలంగాణలో కెసిఆర్( kalvakuntla Chandrasekhar Rao ) కుమార్తె సొంత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆమె అదే పార్టీకి చెందిన తమ సమీప బంధువు హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో ఆమె పై సస్పెన్షన్ వేటు పడింది. ఆమె సైతం తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. అయితే గత కొంతకాలంగా ఆమె సొంత కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతున్నారు. అయితే హరీష్ రావు తో పాటు సంతోష్ రావులపై విమర్శలు చేయడంతో ఆమె అసలు అజెండా బయటపడింది. వారిద్దరి కారణంగానే ఆమె గత కొద్ది రోజులుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఏపీలో అవినాష్ రెడ్డి..
అయితే ఏపీలో సైతం హరీష్ రావు ( Harish Rao)మాదిరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవినాష్ రెడ్డి రూపంలో ప్రతి బంధకం ఏర్పడింది. తెలంగాణలో కెసిఆర్ ను అడ్డం పెట్టుకొని హరీష్ రావు భారీ అవినీతికి తెర తీసారని కవిత చెబుతున్నారు. అదే మాదిరిగా ఏపీలో సైతం అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని హత్య రాజకీయాలకు పాల్పడ్డారని షర్మిల ఆరోపిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడని.. ఆయనను జగన్మోహన్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా కుటుంబ రాజకీయాల మూలంగానే రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలు నష్టపోయాయి అన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ రాజకీయాలు మూలంగానే ప్రత్యర్థులకు అవి వరంగా మారాయి అని టాక్ వినిపిస్తోంది.