Palnadu: ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు పెరుగుతున్నాయి. రాజకీయ, కక్షలతో దాడులు హత్యలకు తెగబడుతున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. తాగునీటి కోసం వచ్చిన ఓ మహిళను ట్రాక్టర్ తో ఢీ కొట్టి దారుణంగా హత్య చేశాడు ఓ వైసిపి నేత అనుచరుడు. పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన. రెంటచింతల మండలం మల్లవరం లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
బాణావత్ సామిని అనే గిరిజన మహిళ నీళ్లు పట్టుకోవడానికి ట్యాంకర్ వద్దకు వెళ్ళింది. అయితే టిడిపి వారికి నీళ్ళు ఇచ్చేది లేదంటూ వైసీపీ నాయకుడు అనుచరుడు, డ్రైవర్ మణికంఠ తేల్చి చెప్పాడు. ట్యాంకర్ ఏర్పాటు చేసింది ప్రజలందరి కోసం కదా అని సామిని ప్రశ్నించింది. మంచినీరు ఇవ్వాలని ఆమె నిలదీయడంతో మణికంఠ బూతులతో రెచ్చిపోయాడు. ట్రాక్టర్ను ముందుకు పోనిచ్చాడు. ట్రాక్టర్ కు ముందున్న బంపర్ తగిలి ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఎదురుగా గోడ ఉండడంతో మధ్యలో చిక్కిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సామినిది నిరుపేద కుటుంబం. ఆమె భర్త సక్రియ నాయక్, కుమారుడు బాలు నాయక్ దివ్యాంగులు. సామిని కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించేది. ఆమె మృతితో ఆ ఇద్దరి పరిస్థితి దయనీయంగా మారింది. సామిని కుటుంబంతో మణికంఠకు చాలా రోజులుగా వివాదాలు ఉన్నాయి. ఈ తరుణంలోనే ఆయన హత్య చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న టిడిపి నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.