YSR Vardhanti: ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి. ఆయన పార్థివదేహాన్ని ఇడుపులపాయ ప్రాంతంలో ఖననం చేశారు కాబట్టి జయంతికి, వర్ధంతికి వైఎస్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటారు. ఆయన సమాధికి నివాళులు అర్పిస్తుంటారు. గతంలో షర్మిల, జగన్ కలిసి ఉన్నప్పుడు సంయుక్తంగానే వచ్చి నివాళులు అర్పించేవారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసేవారు. ప్రార్థనలలో వైయస్ సతీమణి విజయలక్ష్మి పాల్గొనేవారు. అప్పుడంతా సమైక్య కుటుంబం ఉండేది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఎవరిదారులు వారు చూసుకున్నారు. ఒకానొక సందర్భంలో విజయలక్ష్మికి జగన్ నోటీసులు కూడా పంపించారు. దానికి విజయలక్ష్మి కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ మధ్య కొద్దిరోజులపాటు వారిద్దరి మధ్య మాటలు లేవని కూడా తెలిసింది.
మంగళవారం వైయస్ 16వ వర్ధంతిని పురస్కరించుకొని జగన్ తన సతీమణి భారతి తో కలిసి ఇడుపులపాయకు వచ్చారు. వైయస్ విజయలక్ష్మి కూడా అక్కడికి వచ్చారు. కొడుకును చూడగానే దగ్గరికి తీసుకొని నుదుటిమీద ముద్దు పెట్టారు . ఆ తర్వాత చేతిలో బైబిల్ పట్టుకుని వైయస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చేశారు. భారతి జగన్ కలిసి వైయస్ సమాధి వద్ద నివాళులర్పించారు. విజయలక్ష్మి కూడా పుష్పగుచ్చం నుంచి కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత తన కొడుకుతో కొద్దిసేపు మాట్లాడారు.
Also Read: వైఎస్ఆర్ వర్ధంతి: ఓ సంక్షేమ రారాజు అస్తమించిన రోజు
గడచిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాలం నుంచే వైయస్ కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. అప్పటినుంచి ఎవరి దారి వారిదే అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. విజయలక్ష్మి షర్మిల వద్ద ఉంటున్నది. కొన్ని సందర్భాలలో కుమార్తెతో కలిసి విదేశాలకు కూడా వెళ్ళింది. జగన్ కంపెనీలో వాటాలకు సంబంధించి అప్పట్లో షర్మిల తో విభేదాలు చోటుచేసుకున్నాయి. అవి కాస్తా పరస్పరం నోటీసులు ఇచ్చుకునే దాకా వెళ్ళిపోయాయి. దీనికి తోడు షర్మిల తన రాజకీయ ప్రయాణాన్ని వేరే విధంగా మొదలుపెట్టారు. మొదట్లో తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అది కాస్త వికటించడంతో కాంగ్రెస్లో చేరిపోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే కొద్ది రోజులపాటు జగన్ తో సరిగ్గా మాట్లాడని విజయలక్ష్మి.. ఉన్నట్టుండి వైయస్ వర్ధంతి సమయంలో కలవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు జగన్ నుదుటిమీద ముద్దుపెట్టిన దృశ్యాలను వైసీపీ సోషల్ మీడియా ప్రధానంగా పోస్ట్ చేసింది. దీనిని బట్టి ఇద్దరి మధ్య విభేదాలు తొలగిపోయాయని.. తల్లి కొడుకులు కలిసిపోయారని వైసీపీ చెప్పకనే చెబుతోంది.. అయితే ఇది తాత్కాలికమా.. శాశ్వతమా అన్నది కాలమే చెప్పాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.