Pulivendula: పులివెందుల( pulivendula) విషయంలో జగన్ రూట్ మార్చారా? మొన్నటి జడ్పిటిసి ఎన్నికలు ఈ మార్పునకు కారణమా? 2029 ఎన్నికల్లో ఎదురుదెబ్బ ఉంటుందని భావిస్తున్నారా? అక్కడ రాజకీయ ప్రత్యర్థులు పట్టు సాధించాలని చూస్తున్నారా? అందుకే జగన్మోహన్ రెడ్డి ముందే మేల్కొన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 1978 నుంచి పులివెందుల వైయస్ కుటుంబానికి పెట్టని కోట. అక్కడ ఏ ఎన్నికల్లోనైనా గెలిచేది వైయస్ కుటుంబ మనుషులే. వారు సూచించిన వారే. కానీ మొన్నటి ఎన్నికల్లో సీన్ మారింది. జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గింది. జడ్పిటిసి ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురైంది. అయితే టిడిపి కూటమి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే వైసిపి పరిస్థితి ఇది అంటూ టిడిపి కూటమి తిరిగి ఆరోపిస్తోంది. దీంతో వైసీపీ శిబిరంలో ఆందోళన ప్రారంభం అయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి మేల్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను తన భార్య భారతికి అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది.
* అప్పట్లో భువనేశ్వరి.. కుప్పంలో( Kuppam ) చంద్రబాబును ఓడిస్తామని వైసిపి శపధం చేసిన సంగతి తెలిసిందే. వైసిపి హయాంలో కుప్పం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక సంస్థలను పూర్తిగా కైవసం చేసుకుంది. దీంతో చంద్రబాబును ఓడిస్తామన్న ధీమా కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ తన సీనియారిటీని ఉపయోగించి.. కుప్పం నియోజకవర్గంలో ఎలా పట్టు బిగించాలో చంద్రబాబు చూశారు. తరచూ కుప్పంలో పర్యటనలు చేశారు. అంతటితో ఆగకుండా కుప్పంలో సొంత ఇల్లు కట్టుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇంటి నిర్మాణ బాధ్యతలను తన భార్య భువనేశ్వరికి అప్పగించారు. భువనేశ్వరి తరచు కుప్పంలో పర్యటిస్తూ.. పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేశారు. ఆపై ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు. దీంతో చంద్రబాబుకు షాక్ ఇవ్వాలనుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీని వెనుక కచ్చితంగా భువనేశ్వరి ఉన్నారన్నది కుప్పం టిడిపి శ్రేణులు చెబుతున్న మాట. ఎప్పుడైతే కుప్పంలో వైసిపి పట్టు బిగించాలని చూసిందో.. అప్పుడే భువనేశ్వరి ద్వారా చంద్రబాబు కట్టడి చేసే ప్రయత్నం చేశారు.
* ఏర్పాట్లు అన్ని భారతీయే!
అయితే చంద్రబాబు( CM Chandrababu) నుంచి గుణపాఠాలు నేర్చుకున్నట్టు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు తన భార్య భారతిని ముందు పెట్టి.. పులివెందులలో పట్టు సాధించాలని చూస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పులివెందుల బాధ్యతలను చూసుకునేవారు వివేకానంద రెడ్డి. జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఆ బాధ్యతను తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల చూసుకునేవారు. కానీ వారిద్దరూ జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. కుటుంబంలో కూడా చీలిక వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో మొన్నటి జడ్పిటిసి ఎన్నికల్లో అవినాష్ రెడ్డి పై బాధ్యతలు పెట్టారు. కానీ అవినాష్ రెడ్డి పై వివేకానంద రెడ్డి హత్య ప్రభావం ఉంది. అందుకే మొన్నటి ఎన్నికల్లో ప్రతికూలత చూపినట్లు విశ్లేషణలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు భారతి రెడ్డిని పులివెందులలో అందుబాటులోకి ఉంచి రాజకీయం చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి. పులివెందులలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు భారతీ రెడ్డి చూసుకున్నారు. వచ్చిన పార్టీ శ్రేణులతో పాటు కుటుంబ అభిమానులకు ఆమె సాదరంగా ఆహ్వానం పలికారు. వారికి ఏ ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. తద్వారా పులివెందుల బాధ్యతలు ఇకనుంచి భారతికి అప్పగిస్తామని సంకేతాలు ఇవ్వగలిగారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.