YSR Congress: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి ఆ మాజీ మంత్రి తలనొప్పిగా మారారు. అధినేత ఎంతో అభిమానం చూసి పదవులు ఇస్తే ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చి పెడుతున్నారు. దీంతో అధినేత జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు మాజీ మంత్రి తీరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు తెగ ఇబ్బంది పడుతున్నట్లు హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్ టాపిక్ అవుతోంది. సదరు మాజీ మంత్రి వ్యవహార శైలి చర్చకు దారితీస్తోంది. ఆ నియోజకవర్గంలో ఆ మాజీ మంత్రి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నట్టు పరిస్థితి ఉంది.
Also Read: వైసిపి మాజీ ఎంపీ ఆస్తుల వేలం!
* తాటిపర్తి చంద్రశేఖర్ గెలుపు..
ప్రకాశం జిల్లా( Prakasam district) ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ విజయం సాధించారు. కూటమి ప్రభంజనంలో సైతం నిలబడ్డారు చంద్రశేఖర్. అయితే అక్కడ ఇప్పుడు మాజీమంత్రి ఆదిమూలం సురేష్ ప్రమేయం ఎక్కువ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి మూలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు పెరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి గెలిచారు ఆదిమూలపు సురేష్. దీంతో జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లో తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో సైతం కొనసాగింపు ఇచ్చారు. అయితే ఎన్నికలకు ముందు ఆదిమూలపు సురేష్ పై వ్యతిరేకత ఉందని భావించి ఆయనను కొండేపి కి పంపించారు. అయితే ఎర్రగొండపాలెం లో తాటిపర్తి చంద్రశేఖర్ కు అవకాశం ఇచ్చారు. కొండేపిలో సురేష్ ఓడిపోయారు. ఎర్రగొండపాలెం లో మాత్రం చంద్రశేఖర్ గెలిచారు. అయితే ఎర్రగొండపాలెంలో పోటీ చేసి ఉంటే తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవాడినని సురేష్ భావిస్తున్నారు. అందుకే కొండేపి వదిలి ఎర్రగొండపాలెం పై ఇప్పుడు సురేష్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తో విభేదాలు ఏర్పడుతున్నాయి.
* రెండుసార్లు ఎర్రగొండపాలెం నుంచి..
వాస్తవానికి 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆదిమూలపు సురేష్( Aadi moolapu Suresh) . రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో తొలిసారిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2019లో తిరిగి ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసిన సురేష్ అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో సైతం తనకు ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని కేటాయించాలని అధినేతను కోరారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కొండేపి పంపించారు. అయీష్టత గానే అక్కడి నుంచి వెళ్లారు కానీ.. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత ఎర్రగొండపాలెం పై దృష్టి పెడుతున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ తో ఆయనకు విభేదాలు ఏర్పడుతున్నాయి.
– పీఏసీ కమిటీ సభ్యుడిగా ఎంపిక..
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో( political Advisory Committee ) ఆదిమూలపు సురేష్ కు ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కొండేపి నియోజకవర్గం పై దృష్టి పెట్టాలని సూచించారు. కానీ అందుకు సిద్ధంగా లేరు ఆదిమూలపు సురేష్. తనకు అన్ని విధాల ఎర్రగొండపాలెం అయితే సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పట్టు బిగిస్తున్నారు. అయితే ఆదిమూలపు సురేష్ ఒకానొక దశలో టిడిపిలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే అక్కడ పరిస్థితులు ఆశాజనకంగా లేవు. అందుకే ఎర్రగొండపాలెం వైసిపి బాధ్యతలు తనకే ఇవ్వాలని అధినేతపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read: కడపలో వైసీపీ నేతలతో అదృశ్య శక్తి.. బిజెపి ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు!